జులైలో 31.9ష్టాలియన్ డాలర్లు
పెరిగిన చిప్స్, బంగారం దిగుమతులు
న్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సముద్ర రవాణా వ్యయాల భారం భారత వాణిజ్య లోటును అమాంతం పెంచుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం.. జులై నెలలో భారత్ సరుకు వాణిజ్య లోటు 31.98 బిలియన్ డాలర్లకు చేరి ఆరు నెలల గరిష్ఠ స్థాయికి ఎగిసింది. జూన్ నెలలో 30.43 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ లోటు.. ఆర్థికవేత్తలు అంచనా వేసిన 30.20 బిలియన్ డాలర్ల కంటే భారీగా పెరగడం ఆందోళకరం. దిగుమతి వ్యయం వేగంగా పెరగడమే ఈ వాణిజ్య లోటు విస్తరణకు ప్రధాన కారణంగా నిలిచింది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, రవాణా ఆటంకాలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రానిక్స్, బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశంలోకి వచ్చే వస్తువుల బిల్లు అమాంతం ఎగబాకింది. జూన్ నెలలో 70.84 బిలియన్ డాలర్లుగా ఉన్న మొత్తం దిగుమతులు జులై నాటికి 76.22 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ముఖ్యంగా చిప్స్‌తో సహా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 44 శాతానికి పైగా పెరిగి 14.37 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగి 4.16 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. చమురు దిగుమతులు 18.31 బిలియన్ డాలర్లుగా నమోదు కావడంతో పాటు ఇతర ప్రధాన ఉత్పత్తుల దిగుమతి వ్యయం పెరగడం వల్ల వాణిజ్య లోటు తీవ్రమైంది. జులై నెలలో భారత వస్తు ఎగుమతులు 44.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం 2022 జులై నాటి 38.34 బిలియన్ డాలర్ల పాత రికార్డును దాటేశాయి.
రూపాయిపై ఒత్తిడి..
ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో పెరుగుతోన్న వాణిజ్య లోటు అంతిమంగా రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు రాబోయే రోజుల్లో భారత రూపాయి విలువపై, ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడి గురి చేసే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దక్షిణాసియా నుంచి అమెరికా, యూరప్ మార్గాల్లో షిప్పింగ్ ఫ్రైట్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, కంటైనర్ల కొరత వల్ల బియ్యం, జౌళి, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతిదారుల లాభ మార్జిన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పెరుగుతున్న దిగుమతి బిల్లుల కారణంగా విదేశీ మారక నిల్వలపై భారం పడే ప్రమాదం ఉండటంతో రానున్న నెలల్లో వాణిజ్య సమతుల్యతను కాపాడుకోవడం కేంద్ర ప్రభుత్వానికి అతిపెద్ద సవాలుగా మారనుంది.








కామెంట్‌లు (0)