గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅంగన్‌‌వాడీలకు వేతనాలు పెంచాలి

1 గంట క్రితం

AP Anganwadi Workers and Helpers Union
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 10:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌‌ హెల్పర్స్‌ యూనియన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు నిరంతరం సేవలందిస్తున్న అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, పని భారం పెంచుతున్న నవచేతన యాప్‌ను రద్దు చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌‌ హెల్పర్స్‌ యూనియన్‌ (‌సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు గుంటూరులోని ‌స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌ను గురువారం కలిసి వినతి ప్రతాన్ని అందజేశారు. 2019 నుంచి వేతనాలు పెరగకపోవడంతో అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 10న ఐసీడీఎస్‌ మంత్రి వర్యులతో జరిగిన చర్చల్లో అంగన్‌వాడీల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, నేటికీ ఆ హామీ నెరవేరలేదని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు పోషణ ట్రాకర్‌, బాల సంజీవిని, మిల్లెట్‌ యాప్‌ తదితర యాప్‌ల ద్వారా వివిధ వివరాలను నమోదు చేయాల్సి రావడంతో అంగన్‌‌వాడీలు తీవ్ర వత్తిడికి గురువుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్వహించే పిల్లల ఆరోగ్య వివరాల నమోదు బాధ్యతను కూడా అంగన్‌వాడీలపై మోపడం సరికాదన్నారు. పోషణ ట్రాకర్‌లో ఫేస్‌ క్యాప్చర్‌ చేసిన సమయంలో సిగ్నల్‌ సమస్యలు, సాంకేతిక లోపాల కారణంగా ఒక్కో లబ్ధిదారుడి నమోదు కోసం ఎక్కువ సమయం పడుతోందని పేర్కొన్నారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలని కోరారు. అలాగే హెల్పర్‌ ప్రమోషన్‌ మార్గదర్శకాల్లోని జీవో నంబర్‌ 5ను సవరించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, గ్రామాల్లో పెన్షన్‌ విధులు తదితర అదనపు బాధ్యతలను అంగన్‌వాడీలకు అప్పగించకూడదని కోరారు. అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్