ఎన్నికల సంఘానికి వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నిజమైన ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోరాదని కేంద్ర ఎన్నికల సంఘానికి వైసిపి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం నాడు ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. స్థానికంగా లేని ఓటర్ల స్థానంలో సంబంధిత పత్రాల సమర్పణకు వారి బంధువులకు అవకాశమివ్వాలని కోరారు. ఇఆర్ఒల వద్దే తుది నిర్ణయం తీసుకుని, ఓటర్లు తిరగాల్సిన అవసరం లేకుండా బిఎల్ఓలతోనే పత్రాల పరిశీలన చేయించాలని కోరారు. తనిఖీ ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి, విద్య, వలసల కారణంగా స్థానికంగా అందుబాటులో లేని ఓటర్ల తరఫున వారి తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీకులు తగిన అధికార పత్రాలతో ఆధారాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే, ఓటర్లకు జారీ చేసే నోటీసుల్లో తనిఖీ వేదిక, తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను కచ్చితంగా పేర్కొనేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆదేశాలు జారీ చేయాలని కోరారు.








కామెంట్‌లు (0)