- ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు
విజయవాడ: ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నగరంలో చేపట్టిన నేడు జరగనున్న ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సీపీఎం నేతలపై ముందస్తు నిర్బంధ చర్యలకు దిగారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. పలువురు నాయకులను హౌస్ అరెస్టు చేయగా, మరికొందరి ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నగరంలోని పలువురు నేతలకు ఫోన్లు చేసి విచారించడంతో పాటు, బయటకు రావద్దని హెచ్చరిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన ఇంటికి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు వచ్చానరని, పాయకాపురం, శాంతినగర్ ప్రాంతాల్లో సీపీఎం నేత సీహెచ్ శ్రీనివాస్‌ను హౌస్ అరెస్టు చేసి, ఆయన ఇంటి వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారని తెలిపారు. మరో నేత బోయి సత్యబాబు ఇంటికి వచ్చిన పోలీసులు ఇంట్లో మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, శాంతియుత ఆందోళనలకు అవకాశం ఇవ్వకుండా నిర్బంధ చర్యలకు పాల్పడటం, ముందస్తు అరెస్టులు చేయడం, బెదిరింపులకు దిగడం శోచనీయమని సీహెచ్ బాబూరావు విమర్శించారు.దేశవ్యాప్తంగా ఓటు హక్కును హరించే విధంగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై తెలుగుదేశం, జనసేన పార్టీలు స్పందించకపోగా, రాష్ట్రంలో నిరసన తెలిపే వారిని అడ్డుకోవడం గర్హనీయమని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు చేపట్టే శాంతియుత నిరసనలను నిర్బంధాలతో అడ్డుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)