- యువతరం మార్పును తట్టుకోలేక నిందలు
- స్వాతంత్రోద్యమ చరిత్రలేని ఆర్‌ఎస్‌ఎస్
- భూస్వాములు, జమిందారుల పక్కన చేరిన జనసంఘ్
- నకిలీ దేశభక్తి, రామభక్తి, నైతిక విలువల బండారం బయటపడుతోంది
- అయోధ్య రామాలయాన్ని కొల్లగొట్టిన బిజెపి
- కమ్యూనిస్టులపై నిందుల వేస్తే సహించబోమని హెచ్చరిక
ప్రజాశక్తి-విజయవాడ : కమ్యూనిస్టులపై బిజెపి నాయకుల అసత్య, ఆరోపణలను, అబద్దపు, వాగాడంబర ప్రచారాలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, సిపిఐఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు పి.ప్రసాదు, ఎం.రామకృష్ణ, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు బి.బంగార్రావు, ఎంసిపిఐయు నాయకులు కాటం నాగభూషణం, సిపిఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్‌బాబు, పార్వార్డ్ బ్లాక్ నాయకులు పి.వి.సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు జానకిరాములు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో బిజెపి రాష్ట్ర కమిటీ ప్రచురించిన “జాతీయ భావం కొరవడిన కమ్యూనిస్టులు” అనే పుస్తకావిష్కరణ సభలో జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర గురించి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు చేసిన ఉపన్యాసం వక్రీకరణలు, తీవ్రమైన అసత్యాలు, అబద్ధాలతో కూడిన తప్పుడు ప్రచారాలను వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీషు వాళ్ళ కొమ్ముకాచి వెన్నుపోటు పొడిచిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ అసలు బండారాన్ని దాచిపెట్టి కమ్యూనిస్టులపై నిందలు మోపడం సూర్యుడిపై ఉమ్మివేయడమేనని పేర్కొన్నారు. జెన్-జెడ్ యువతరంలో వస్తున్న మార్పును తట్టుకోలేని బిజెపి మరోసారి కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారానికి పూనుకుంటోందని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ ప్రారంభం నుండి జాతీయ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిందని, కాంగ్రెస్‌తో కలిసి, విడిగాను పోరాడి త్యాగాలు చేసిందని తెలిపారు. బ్రిటీషు పాలకుల కుట్ర కేసులు ఎదుర్కొందని, గ్రామీణ పేదలు, పట్టణ కార్మికవర్గ విముక్తికి సామాజిక, లింగ వివక్షలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయాయని వివరించారు. దున్నేవానికి భూమి కావాలనే పోరాటంలో వేలమంది ప్రాణాలు బలి తీసుకున్న నాటి సంస్థానాధీశులు, జమిందారులు, భూస్వామ్య శక్తుల పంచన చేరిన జనసంఘ్ వారసులు ఆనాటి నుండి ఈనాటి వరకు పాడిందే పాడుతూ చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. రోజూ నెహ్రూను తిట్టిపోస్తూ, ఇప్పుడు తమ ద్రోహాన్ని కప్పెట్టుకోడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నెహ్రూ సోషలిజానికి, గాంధీ జాతీయ భావానికి ప్రతినిధిగా చెప్పుకున్నారని, మరి అటువంటి గాంధీని హత్య చేసింది ఎవరో ఆయన చెప్పలేదని విమర్శించారు. స్వాతంత్రోద్యమంలో ఎలాంటి పాత్రలేని వీరు జాతీయ ఉద్యమం గురించి, జాతీయత గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని పేర్కొన్నారు. కులవివక్ష, మనుధర్మ సిద్ధాంతం, భూస్వామ్య దోపిడి వ్యవస్థతో తరాలుగా అణచబడిన అట్టడుగు వర్గాలకోసం కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాల ఫలితమే నేడు పాలక పార్టీలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని వివరించారు. ఇన్నాళ్లుగా బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రచారం చేసుకున్న నకిలీ దేశభక్తి, రామభక్తి, నైతిక విలువల అసలు బండారం ఒక్కొక్కటిగా బయటపడుతుండంతో బెంబేలెత్తిపోయి కమ్యూనిస్టులపై పాత నిందలను కొత్త గొంతులతో వినిపిస్తున్నారని తెలిపారు. శ్రీరాముని పేరు చెప్పి ఓట్లు దండుకొని అయోధ్య రామాలయాన్నే కొల్లగొట్టిన బిజెపి ద్రోహాన్ని ప్రజలు విస్మరించరని హెచ్చరించారు. ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకున్న బిజెపి తిరిగి అక్రమ పద్దతిలో అధికారానికి రావాలని చూస్తోందని, సర్ పేరుతో ఓట్లు తొలగించిన బిజెపి కుట్ర బట్టబయలైందని అలాంటి పార్టీ కమ్యూనిస్టులపై నిందలు వేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు.







కామెంట్‌లు (0)