ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా): చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ, రామనాథం, పూర్ణ చంద్రరావు, గంజి శ్రీనివాసరావు, భీమిశెట్టి భారతి తదితరులు గుంటూరు కలెక్టరేట్, మంగళగిరిలోని చేనేత జౌళిశాఖ కమిషనర్ కార్యాలయాల వద్ద విస్తృత ప్రచారం చేశారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ముడి సరుకుల ధరలు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు సకాలంలో అందకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి భద్రత కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చేనేత రంగ పరిరక్షణ, కార్మికుల జీవనోపాధి మెరుగుదల, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులు, నేతన్నలు, మహిళా కార్మికులు, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
22న కలెక్టరేట్ల వద్ద చేనేతల ధర్నా
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 01:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)