- వై కేశవరావు
చారిత్రాత్మకమైన ఢిల్లీ ఉద్యమం ముగిసి వచ్చే నవంబరు 26 నాటికి ఐదు సంవత్సరాలు అవుతుంది. రైతాంగం రుణగ్రస్తమై ఆత్మహత్యలకు పాల్పడుతున్న కాలంలో రైతాంగాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రుణ విముక్తులను చేయాలని, డా. స్వామినాథన్ కమిషన్ సూచన ప్రకారం సి2+50 మద్దతు ధరల చట్టం చేయాలని కోరుతూ ఉద్యమం సాగిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా మూడు నల్ల వ్యవసాయ చట్టాలు చేసింది. ఆ చట్టాల రద్దు కోసం 13 మాసాలు అకుంఠిత దీక్షతో ప్రజాస్వామ్యయుతంగా సాగిన ఉద్యమం అది. 736 మంది రైతులు ప్రాణాలు అర్పించిన ఉద్యమం. విధి లేని స్థితిలో కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకుంది. ఆ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకమైన హామీ ఇచ్చింది. ఆ హామీని పురస్కరించుకొని 1921 డిసెంబర్ 9న ఉద్యమం విరమించింది. గడచిన ఐదు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ అమలు పరచకుండా మోసగిస్తూ వస్తుంది. పంటలకు మద్దతు ధరలు కల్పిస్తానన్న మోడీ ప్రభుత్వం సి2+50ఫార్ములా కు మారుగా మోసపూరిత మైన ఎ2+ఎఫ్.ఎల్ విధానాన్ని ప్రకటించింది. ప్రధానమైన 20 పంటలు పండించే రైతాంగం సి2+50 విధానానికి ఎ2/ఎఫ్ ఎల్ విధానానికి తేడా వల్ల 2016 నుండి 2026 మధ్య కాలంలో 27 లక్షల కోట్లు కోల్పోయినట్లు ఆర్థికవేత్తలు ధ్రువీకరించారు. ఈకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటులో జోక్యం చేసుకొనటం లేదు. ఫలితంగా రైతాంగానికి ఎ2+ఎఫ్.ఎల్ ధరలు కూడా రావటంలేదు.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు
2024లో తిరిగి అధికారం చేజిక్కించుకున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం అమెరికాతోనూ, యూరప్‌తోనూ, న్యూజిలాండ్‌తోనూ, బ్రిటన్ తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందాలు అమలు అయితే విదేశాల నుండి ఏ విధమైన పన్నులు లేకుండా ఏటా వేల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి అవుతాయి. మనకు సమృద్ధిగా పండే గోధుమలు, మొక్కజొన్న, పత్తి, పండ్లు, కూరగాయలు, గొర్రె మాంసం, పాలు, పాల పదార్థాలు వంటివన్నీ దిగుమతి అవుతాయి. వాటితో పోటీ పడలేక మన రైతాంగం దివాలా తీయడం తప్ప గత్యంతరం ఉండదు . మన దేశ అవసరాలకు సరిపడా పంటలు పండించే 11 కోట్ల రైతు కుటుంబాలు దివాలా తీస్తాయి. 8 కోట్ల పాడి రైతుల కుటుంబాలు దివాలా తీస్తాయి. మనం ఎగుమతి చేసే పంటలు మిరప, పొగాకు, శనగలు, మామిడి, రొయ్యలు తదితర పంటలపై 18 శాతం పన్నులు విధిస్తారు. ఆ ప్రభావంతో ఇప్పటికే మన పంటలు ధరలు పడిపోయి రైతాంగం నష్టపోతున్నారు. అగ్రిమెంట్ పూర్తిగా అమలులోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
రష్యా నుండి చౌకగా వచ్చే ఆయిల్‌కు బదులుగా అమెరికా నుండి 20 శాతం అదనపు రేటుతో ఆయిల్ తీసుకోవాలి. ఫలితంగా ట్రాక్టర్లు కోత యంత్రాలు, స్ప్రేయర్లు తదితర ఖర్చులు అన్నీ పెరిగిపోతాయి. ఈ అగ్రిమెంట్లు విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకు, ఎగుమతి దిగుమతి వ్యాపారులకు లాభాలు పోగేసు కోవడానికి ఉపయోగపడతాయి. వారి ప్రయోజనాల కోసం ప్రమాదకరమైన విధంగా చట్టాలు అన్నింటిని సవరిస్తుంది. నాలుగు కార్మిక కోడ్ లు అమల్లోకి తెచ్చింది. 12 గంటల పని విధానం ప్రవేశపెట్టింది. కార్మికుల హక్కులన్నీ హరించింది. ఈ చట్టాలు వ్యవసాయ రంగానికే కాదు మన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, చిన్న వ్యాపారులకు హాని కలిగిస్తాయి..
చట్టాల్లో మార్పులు ప్రమాదకరం
కార్పొరేట్ కంపెనీల, ఎగుమతి దిగుమతి వ్యాపారుల ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా రైతుల ప్రయోజనాలు కాపాడుతున్న చట్టాలన్నింటిని మార్పులు చేసింది. వ్యవసాయ మార్కెట్ల చట్టానికి కంపెనీల, ఎగుమతి దిగుమతి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా సవరణలు చేసింది. ఈ చట్టం ప్రకారం పంటలకు మద్దతు ధరలు ఉండవు. ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోలు ఉండవు. వ్యాపారుల ఇష్టారాజ్యం అవుతుంది. సహకార వ్యవస్థలన్నీ కంపెనీల వ్యాపారుల పరం అవుతాయి. వ్యాపారుల ప్రతినిధులు సంఘాలలో చేరటానికి అధ్యక్షులుగా ఎన్నికవ్వటానికి వీలు కల్పించారు. విద్యుత్ సవరణ చట్టం ప్రకారం ఐదేళ్లలో సబ్సిడీ లన్ని రద్దు చేస్తారు. సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు ప్రైవేటు కంపెనీల హస్తగతం అవుతాయి. స్మార్ట్ మీటర్లు నిర్బంధం అవుతాయి. ఆ ఖర్చులు కూడా ప్రజలే భరించాలి. విత్తన చట్టంలో మార్పులు చేశారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే విధానం తొలగించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలు, వ్యాపారులను మూడు తప్పుల వరకు వదలాలని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇచ్చే క్లాజులు తొలగించారు. రుణాలు రీ షెడ్యూల్ చేసే క్లాజులు తొలగించారు. ఎరువులపై కంట్రోల్ తొలగించారు. ఎప్పటికప్పుడు ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు. యూరియాకు బదులు నిర్దారించని నానో లిక్విడ్ ప్రవేశపెట్టారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉసురు తీశారు. నిధులు ఉన్నంతవరకే అని చేర్చారు. గ్రామాల అవసరాలతో నిమిత్తం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మాత్రమే వర్తించారు. భూసేకణ చట్టాలన్నీ సవరించారు. కార్పొరేట్ కంపెనీలకు, సోలార్ కంపెనీలకు, గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు చౌకగా భూములు కౌలు కు ఇచ్చే విధానం ప్రకటించారు. ఆ భూములు తిరిగి రైతులకు వస్తాయనే గ్యారెంటీ లేదు. పంటల భీమా స్వచ్ఛందం అని చెప్పారు. ప్రీమియం పెంచారు. ప్రైవేట్ కంపెనీల లాభాలను గ్యారెంటీ చేశారు.
మనం కోరుతున్న చట్టాలు
అమెరికాతో సహా అన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు రద్దు చేయాలి. సి 2+ 50 ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలి . నాలుగు లేబర్ కోడ్ లు ఉపసంహరించాలి. కనీస వేతనం రూ.31 వేలు ఇవ్వాలి. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల రుణాలు రద్దు చేయాలి. ఆత్మహత్యలు చేసుకుని మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి. మహాత్మా గాంధీ ఉపాధి పథకం పునరుద్ధరించాలి. 200 రోజుల పని, రూ.700 కూలి ఇవ్వాలి. కార్పొరేట్ల కోసం నిర్బంధ భూ సేకరణ నిలుపు చేయాలి. 2013 భూ సేకరణ చట్టం, ఫారెస్ట్ రైట్స్ ఆక్ట్ వన్ ఆఫ్ సెవెంటీ అమలు పరచాలి. విద్యుత్, విత్తన ప్రకృతి వైపరీత్యాల చట్టాల సవరణలన్నీ ఉపసంహరించాలి.
పోరాటానికి నిర్దిష్ట రూపాలు
పై చట్టాల సాధనకై దీర్ఘకాలిక పోరాటాలను రూపొందించింది. 2026 నవంబర్ 26 నుండి దేశంలో 100 కేంద్రాలలో దీక్షా శిబిరాలు నిర్వహించాలి. అక్టోబర్ 3 నుండి లక్కింపూర్ ఖేరీ అమరుల రోజు నుండి వలంటీర్లను నమోదు చేయాలి. అందుకు సన్నాహంగా సెప్టెంబరు నెలాఖరు లోపుగా రాష్ట్రస్థాయిలో రైతు సంఘాల ట్రేడ్ యూనియన్ల జాయింట్ సదస్సు జరపాలి.
పై పోరాటానికి ముందస్తుగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశం మొత్తం పై 1000 కేంద్రాల్లో జైలు బరో కార్యక్రమం నిర్వహించాలి.ఈ సందర్భాన్ని వివరిస్తూ కరపత్రాలు ద్వారా, ర్యాలీల ద్వారా ట్రాక్టర్ ర్యాలీల ద్వారా, రైతాంగంలో చైతన్యం కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం సాగించాలి.
10వ తేదీ జరిగే జైల్ భరో రాబోయే పోరాటానికి స్పూర్తి ఇవ్వాలి. గ్రామగ్రామాన రైతులను, వ్యవసాయ కార్మికులను, కౌలు రైతులను, గ్రామీణ పేదలను, స్కీము వర్కర్లను చైతన్యపరచి ఐక్ర పరచచాలి.పంటలకు మద్ధతు దరలు కల్పిస్తానన్న మోడి ప్రభుత్వం సి2+50 ఫార్ములా కు మారుగా మోసపూరిత మైన ఎ2 + ఎఫ్.ఎల్ విదానాన్ని ప్రకటించింది. ప్రధానమైన 20 పంటలు పండించే రైతాంగం సి2+50 విధానానికి ఎ2/ఎఫ్.ఎల్ విధానానికి తేడా వల్ల 2016నుండి 2026 మధ్య కాలంలో 27 లక్షల కోట్లు కోల్పోయినట్లు ఆర్థికవేత్తలు ధ్రువీకరించారు. ఈకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటులో జోక్యం చేసు కొనటం లేదు. ఫలితంగా రైతాంగానికి ఎ2+ఎఫ్.ఎల్ ధరలు కూడా రావటంలేదు.
- రైతు సంఘం సీనియర్ నేత







కామెంట్‌లు (0)