విషయాలపట్ల విస్తృత అధ్యయనం, పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించే వాక్య నిర్మాణం, విశేషాల సమాహారాన్ని కళాత్మకంగా ఆవిష్కరించే ప్రత్యేక దృష్టి, వ్యాసాన్ని విజయవంతం చేసే శిల్ప నైపుణ్యం, కార్యసాధన వరకు తడబడని లక్ష్యం, ఉత్తమ ఫలితాల కోసం అంకితభావంతో శ్రమించే ఏకాగ్రత... ఇవన్నీ ఒక ఉత్తమ వ్యాసకర్తకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలన్నింటినీ సమర్థంగా అలవర్చుకున్న డాక్టర్ బండి సత్యనారాయణ కలం నుంచి వెలువడిన మరో విలువైన సాహిత్య కృషే 'దృష్టి' వ్యాస సంపుటి.
'మిత్రుడా! నీలో ఒక పాటనై ప్రతిధ్వనించటానికి నా శేషజీవితం చాలుతుందా...' అంటూ అజంతా గురించి రచయిత పరిచయం చేసిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. అలాగే 'ద్రవిస్తున్న గడియారంతో నిమిత్తం లేదు, జీవన సంఘర్షణలో ఉజ్వలమైన క్షణమొక్కటే నిజం గ్రహిస్తున్నాను...' అంటూ 'స్వప్నలిపి' కవితలో వ్యక్తమైన భావాలను రచయిత విశ్లేషించిన తీరు ఆకట్టుకుంటుంది. 'పగలు రేయి ప్రవహించు కాలప్రవాహాన / ప్రతి నిమిషం ఒక మరణం / ప్రతి క్షణం ఒక జననం' అంటూ జీవన తాత్వికతను ఆవిష్కరించిన ఆలూరి బైరాగి కవిత్వాన్ని స్మరింపజేసిన విధానం ప్రశంసనీయం. తిలక్ కవిత్వాన్ని చదవడం, ఆగిపోయిన గొప్ప సంగీతాన్ని మళ్లీ వినిన అనుభూతిని కలిగిస్తుంది. 'దేవుడా రక్షించు నా దేశాన్ని / పవిత్రుల నుండి, పతివ్రతల నుండి / పెద్దమనుషుల నుండి, పెద్దపులుల నుండి...' అంటూ ఆయన వ్యక్తం చేసిన సామాజిక చైతన్యం, శిల్పం, భావసంపద, శబ్ద సౌందర్యం గురించి రచయిత చేసిన విశ్లేషణ ఆలోచింపజేస్తుంది. డా. సి. నారాయణరెడ్డి 'మంటలు – మానవుడూ' కవితను విశ్లేషించిన తీరు ఎంతో సంతృప్తినిస్తుంది. 'తమసోమా జ్యోతిర్గమయ' సందేశాన్ని తన కవిత్వం ద్వారా ప్రజల్లో నాటిన దాశరథిని రచయిత గౌరవప్రదంగా పరిచయం చేశారు. 'ఆ చల్లని సముద్రగర్భం...' వంటి అభ్యుదయ గీతాల స్ఫూర్తిని మళ్లీ గుర్తుచేస్తూ ఆయనను మరోసారి పాఠకుల ముందుకు తీసుకొచ్చారు.
వచన కవితా పితామహుడు కుందుర్తి విశేషాలు ఈ గ్రంథానికి మామిడాకు తోరణంలా అలంకారమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అయిన కుందుర్తి కవిత్వంలోని విశిష్టతలను ప్రత్యేకంగా ప్రస్తావించడం ఈ సంపుటికి మరింత విలువను చేకూర్చింది. 'గుడిసెలు కాలిపోతున్నై' వంటి గొప్ప కవితా సంపుటిని అందించిన పద్మభూషణ్ బోయి భీమన్న సాహిత్య వైభవాన్ని సమీపంగా దర్శించే అవకాశాన్ని ఈ గ్రంథం కల్పించింది. ప్రజలు చైతన్యవంతులు కానంతకాలం దోపిడీ, దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉంటాయని, ప్రజలను పౌరులుగానే కాక వీరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కవులదేనని ఆయన చెప్పిన సందేశాలను రచయిత సముచితంగా గుర్తు చేశారు. చెట్టు ఉన్నంతకాలం, పచ్చదనం ఉన్నంతకాలం గుర్తుండిపోయే కవి ఇస్మాయిల్. ఆయన 'మృత్యు వృక్షం' వంటి కవితల్లో కనిపించే భావగాఢతను రచయిత చక్కగా విశ్లేషించారు. అలాగే తన మొత్తం కవిత్వాన్నే ఒక సృజనాత్మక ప్రయోగంగా మలిచిన వేగుంట మోహన ప్రసాద్ కవిత్వంలో కనిపించే నైరాశ్య ధోరణిని ఉదాహరణలతో వివరించడం రచయిత అధ్యయనానికి నిదర్శనం.
'వాడు మన పోరు పడలేక, పోతూ పోతూ దేశం మెదడులో వ్యాపార విత్తనం నాటి పోయాడు...' అంటూ ప్రపంచీకరణపై తీవ్ర విమర్శలు చేసిన డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు గురించి చెప్పిన విశేషాలు ప్రేరణాత్మకంగా ఉన్నాయి. 'నా బాల్య దృశ్యాలే / నేను చూసిన అలంకార శాస్త్రాలు / ఆకలి రసం నాలోని రచనా రహస్యం...' అంటూ కవిత్వాన్ని మానవ అనుభవాలతో ముడిపెట్టిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ను రచయిత ఎంతో గౌరవంగా పరిచయం చేశారు. 'కాశ్మీరం, కలహండి, విదర్భ, తెలంగాణ, అరుణాచల్, అస్సాం...' అంటూ భారత సమాజంలోని విభిన్న వాస్తవాలను కవిత్వంలో ప్రతిబింబించిన దేవీప్రియ గురించి చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, రావూరి ఏకాంబరం వంటి సాహితీవేత్తల విశేషాలను కూడా రచయిత సమగ్రంగా ఆవిష్కరించారు. పైడి తెరేష్‌బాబు, కవిశ్రీ నీలం, మద్దూరి నగేష్‌బాబు, చోడగిరి చంద్రరావు వంటి సమకాలీన కవుల సామాజిక చైతన్యాన్ని ఈ సంపుటి సమర్థంగా పరిచయం చేసింది. అలాగే బేబీ కాంబ్లే రచించిన 'మా బతుకులు', జుంపా లహరి సాహిత్య విశేషాలను కూడా చేర్చడం ద్వారా ఈ గ్రంథ పరిధిని మరింత విస్తరించారు.
ఈ సంపుటిలో రచయిత కేవలం మహనీయుల జీవిత విశేషాలను మాత్రమే కాకుండా, వారి సాహిత్య సృజనలోని అంతరార్థాన్ని, భావసంపదను, సామాజిక దృక్పథాన్ని కూడా సమగ్రంగా పరిచయం చేశారు. మనకు తెలిసిన మహనీయులతో పాటు పెద్దగా పరిచయం లేని సాహితీవేత్తల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం ఈ గ్రంథం ప్రత్యేకత. విశేషమైన అధ్యయనం, అపారమైన శ్రమ, సాహిత్య పట్ల నిబద్ధతతో ఈ వ్యాసాలను అందించిన డాక్టర్ బండి సత్యనారాయణకు హృదయపూర్వక అభినందనలు. రూ.130 విలువైన ఈ పుస్తకం కోసం 99890 35136 నెంబర్లో రచయితను సంప్రదించవచ్చు.
- డాక్టర్ కె. జి. వేణు
98480 70084







కామెంట్‌లు (0)