గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టిటిడి ఉద్యోగులపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి : సిఐటియు

1 గంట క్రితం

citu tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 04:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరుపతి : టిటిడి ఉద్యోగులపై ఏపి సిఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్ష‍ులు కందారపు మురళీ గురువారం డిమాండ్‌ చేశారు. శ్రీవారి సేవకుల పేరుతో శాశ్వత ఉద్యోగాలను తగ్గించేఆలోచన సరికాదని అన్నారు. తిరుమలలో శాశ్వత ఉద్యోగులను తగ్గించి, ఆ పనులను శ్రీవారి సేవకులతో చేయించుకోవాలనే విధంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. భక్తులకు నిరంతరం సేవలందించే టిటిడి ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడటం వారి మనోభావాలను గాయపరుస్తుందని పేర్కొన్నారు. శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను గౌరవిస్తామని మురళి తెలిపారు. అయితే, వారి సేవను శాశ్వత ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా చూపడం సరికాదన్నారు. పారిశుద్ధ్యం సహా తిరుమలలో ప్రతిరోజూ నిర్వహించాల్సిన పనులకు తగిన సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు అవసరమని చెప్పారు. ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య పోటీ పెట్టే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలని కోరారు. టిటిడి ఆదాయంలో 50 శాతానికి పైగా ఉద్యోగుల జీతాలకే ఖర్చవుతోందనే వ్యాఖ్యను కూడా మురళి ప్రశ్నించారు. 2025–26 బడ్జెట్‌లో జీతాలు, ఇతర సిబ్బంది చెల్లింపులకు ₹ 1,773.75 కోట్లు కేటాయించగా, మొత్తం బడ్జెట్ ₹5,258.68 కోట్లు. ఇది సుమారు 34 శాతం. ఈ కేటాయింపులో జీతాలతో పాటు ఇతర సిబ్బంది చెల్లింపులూ ఉన్నాయని, దాన్నంతటినీ సాధారణ ఉద్యోగుల జీతంగా చూపడం సరైంది కాదని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు అందుతున్న పరిమిత వేతనాలను, వారు ఎదుర్కొంటున్న పనిభారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గతంతో పోలిస్తే తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య, నిర్వహించాల్సిన సేవలు గణనీయంగా పెరిగాయని మురళి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించకుండా, ఉన్న ఉద్యోగుల పనితీరును తప్పుపట్టడం అన్యాయమన్నారు. సత్యసాయి ట్రస్ట్ సేవా విధానాన్ని ప్రస్తావిస్తూ తిరుమలలోనూ అదే తరహాలో పనులు నిర్వహించాలని సూచించడం, రెండు సంస్థలకు వచ్చే భక్తుల సంఖ్యలోని తేడాను పరిగణనలోకి తీసుకోకపోవడమేనని అన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, టిటిడి ఉద్యోగుల మనోభావాలను గౌరవించేలా వివరణ ఇవ్వాలని మురళి డిమాండ్ చేశారు. తిరుమలలో నిరంతరం అవసరమయ్యే పనులకు శాశ్వత నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్