- లేబర్‌కోడ్స్‌ను ధిక్కరించి సమ్మె విజయంపై సిఐటియు ప్రకటన
ప్రజాశక్తి - విజయవాడ : లేబర్‌కోడ్స్‌ను ధిక్కరించి కృష్ణపట్నం పోర్టులో 6 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మె జరిపి విజయం సాధించారు. కృష్ణపట్నం పోర్టులో ఈ విజయం సాధించిన కాంట్రాక్టు కార్మికులను సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.హెచ్.నరసింగరావు. ఏ.వి.నాగేశ్వరరావులు అభినందనలు తెలుపుతూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సిఐటియు నాయకత్వంలో 2021లో మూడు నెలల పోరాటం అనంతరం కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఆనాటి లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో అంగీకరించి చట్ట ప్రకారం చెల్లించాల్సిన బోనస్‌ను కాsట్రాక్ట్ కార్మికులందరికీ చెల్లించిందని పేర్కొన్నారు. కాని తర్వాత కాలంలో కొంత మందికి చెల్లిస్తూ మరి కొంత మందికి ఎగనామం పెడుతున్నదని తెలిపారు. 2025 బోనస్ అందరికీ చెల్లించాలని 9.11.2026 రాత్రి 11 గంటలకు కాంట్రాక్ట్ కార్మికులంతా మెరుపు సమ్మెకు దిగారు. 24 గంటల్లో బోనస్ అందరికీ చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించిన తర్వాత సమ్మె విరమించి కార్మికులందరూ డ్యూటికి చేరారు. యాజమాన్యం అంగీకరించినట్లుగా కార్మికులందరికీ 24 గంటల్లో బోనస్ చెల్లించలేదు. దీనితో నవంబర్ 10న రాత్రి 8 గంటల నుండి పోర్టు కార్మికులంతా నిరవధిక మెరుపు సమ్మెకు దిగారు. మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ సమ్మె కొనసాగిన తర్వాత యాజమాన్యం దిగివచ్చి అందరికీ బోనస్ చెల్లించడానికి అంగీకరించింది. దీంతో నవంబర్ 11 తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి కార్మికులు తిరిగి విధుల్లోకి వెళ్లారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు 2021 నుండి అదానీ పోర్టు నూరు శాతం వాటాలు కొని యాజమాన్యం వహిస్తున్నది. అదానీ యాజమాన్యంలోని పోర్టులో యావత్ కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడం అభినందనీయమని తెలిపారు. లేబర్‌కోడ్స్ అమల్లో ఉన్నా కార్మికులంతా ఐక్యమైతే ఏదైనా సాధించుకోవచ్చని కృష్ణపట్నం పోర్టు కార్మికులు రుజువు చేశారన్నారు. బోనస్ కోసమే సమ్మెలోకి దిగిన కార్మికులు వారానికి 72 గంటలు పని విధానం కూడా వ్యతిరేకించారని పేర్కొన్నారు. యాజమాన్యం దిగివచ్చి పని గంటలు వారానికి 60కు తగ్గించిందని తెలిపారు. అంతేకాకుండా డ్రైవర్లకు, మెకానిక్‌లకు బేటాను చెల్లించడానికి, ఇతర సమస్యలను కమిటీ ద్వారా పరిష్కరించడానికి అంగీకరించిందన్నారు. కృష్ణపట్నం పోర్టులో నిరంతరంగా లక్ష టన్నుల పైగా బరువుగల పెనామిక్ షిప్‌లు సరుకులు ఎగుమతి, దిగుమతులు చేస్తున్నారు. 24 గంటలు పైగా ఎగుమతి, దిగుమతులకు అంతరాయం కలగడంతో పోర్టు యాజమాన్యంపై కోట్ల రూపాయల జరిమానాలు విధించబడ్డాయన్నారు. దీంతో పోర్టు యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో ప్రత్యక్షంగా చర్చించి కార్మికుల డిమాండ్లను ఆమోదించిందని తెలిపారు. ఇది యావత్ కార్మికుల విజయమని, ఎక్కడైనా కార్మికులంతా ఐక్యంగా పోరాడితే ముఖ్యంగా కీలక రంగాల్లో లేబర్‌కోడ్స్ అమల్లో ఉన్నా ఖచ్చితంగా విజయం సాధించగలమని రుజువైందన వారు పేర్కొన్నారు .








కామెంట్లు (0)