- 100 శాతం గ్రాస్ వేతనం పునరుద్ధరించాలని డిమాండ్
- పారామెడికల్ సిబ్బంది ధర్నాలో వక్తలు
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : వైద్య, ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 100 శాతం గ్రాస్ వేతనాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ ఎంహెచ్‌సీ జేఏసీ) రాష్ట్ర పిలుపు మేరకు సోమవారం ప్రకాశం భవన్ వద్ద మహాధర్నా నిర్వహించారు. జిల్లా నాయకులు జోయల్, సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖలో సుమారు 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, ఇతర పారా మెడికల్ కేడర్లలో సేవలందిస్తున్నారని నాయకులు తెలిపారు. దాదాపు 16 ఏళ్లుగా పారా మెడికల్ పోస్టులకు రెగ్యులర్ నియామకాలు సక్రమంగా జరగకపోవడంతో అర్హత, అనుభవం ఉన్న ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలోనే కొనసాగుతున్నారని పేర్కొన్నారు.
దీర్ఘకాలంగా ప్రభుత్వ వైద్య, ఆరోగ్య సేవలకు సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి సుదీర్ఘ సేవాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర వర్తించే అంశాలతో 100 శాతం గ్రాస్ వేతనాన్ని పునరుద్ధరించాలని, 2018 నుంచి వేతనాల్లో జరిగిన కోతను పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. పారా మెడికల్ కేడర్లలో రెగ్యులర్ నియామకాలకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమానికి ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.శరత్‌బాబు, ప్రధాన కార్యదర్శి కె.వి.కృష్ణారెడ్డి, విద్యార్థి జేఏసీ నాయకులు రాయపాటి జగదీష్ మద్దతు తెలిపారు. వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు.







కామెంట్‌లు (0)