సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ నిర్వాసితులపై నిర్బంధానికి సిపిఎం ఖండన

1 గంట క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 07:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ: పెండింగులో ఉన్న వెలిగొండ నిర్వాసితులకు న్యాయం చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులపైన, వారికి మద్దతు ఇచ్చిన సిపిఎం నాయకత్వంపైన నిర్బంధం ప్రయోగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య ఫోన్ లాక్కొని దౌర్జన్యంగా అరెస్టు చేయడం అమానుషమన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకోసం త్యాగం చేసిన రైతులు, కూలీలు, వృత్తిదారులను రోడ్డున పడేసి దాన్నే ఘనకార్యంగా చెప్పుకోవడం అన్యాయమన్నారు. వెలిగిండ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ప్రయోజనం నిర్వాసితులకు సైతం దక్కాలని, అప్పుడే ఇలాంటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయి అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

వెలిగొండ నిర్వాసితుల మిస్సింగ్ జాబితా ప్రకటించాలని, పరిహారం అందని నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాస కాలనీలలో సౌకర్యాలు కల్పించాలని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు వాగ్దానం చేసిన రూ. 2 లక్షలు వెంటనే ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతంగా మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈరోజు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకత్వాన్ని పోలీసులు ఆకారణంగా అరెస్టు చేయడం గర్హనీయమన్నారు.

ఆందోళన చేస్తున్న వారిని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి నిర్బంధం ప్రయోగించడం ద్వారా అణిచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు. నిర్వాసితుల సమస్యలపై ఎలాంటి ఉద్యమం లేకుండా చేయాలన్న స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి కారణంగా నిర్వాసితులపై పోలీసులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. సోమయ్యను అరెస్టు చేయడమేగాకుండా గాయాలైనా వైద్యం చేయించలేదన్నారు. దాడికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, జిల్లా కార్యదర్శి సోమయ్యకు వెంటనే చికిత్స అందించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసితుల పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్