- పిఠాపురం 31వ వార్డులో దళితుల కష్టాలు
- దశాబ్దాలుగా పరిష్కారానికి నోచని వైనం
ప్రజాశక్తి - పిఠాపురం(కాకినాడ జిల్లా) : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితుల ఆఖరి మజిలీకి అనంత కష్టాలు పడుతున్నారు. స్మశానానికి దారి లేక, సరిపడా స్థలం లేక అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నారు. అసలే అయినవారిని కోల్పోయి దు:ఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు, వారి అంత్యక్రియలు నిర్వహించడం సవాలుగా మారుతోంది. తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 31వ వార్డు పరిధిలో సీతయ్యగారితోట, జీవన్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి. సుమారు రెండు వేలకుపైగా దళిత కుటుంబాలు ఈ కాలనీల్లో నివసిస్తున్నాయి. ఈ ప్రాంత వాసులు ఎవరైనా మృతి చెందితే మంగయ్యమ్మరావు పేటలో చెరుకుల కాలువ పక్కన మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కాలనీలు ఏర్పడిన నాటి నుంచి అంటే దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా వారు ఇక్కడే అంత్యక్రియలు నిర్వస్తున్నారు. ఇంత కాలం నుంచి వారు ఆ అరెకరంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
కాలువను దాటాల్సిందే...
స్మశానవాటికకు సరైన రహదారి లేకపోవడంతో కాలువలో దిగి ముళ్లపొదలు, తుప్పల మధ్యగా మృతదేహాలను తీసుకెళ్లాల్సి వస్తోంది. వర్షాకాలం అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. కాలువ ఉధృతంగా ఉంటే అది తగ్గేవరకూ అంత్యక్రియలను వాయిదా వేసుకోవడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి. రెండు మూడు రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తోందని దళితులు చెబుతున్నారు.
అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా...
ఈ సమస్యపై పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినట్టు స్థానిక దళితులు తెలిపారు. తాజాగా గత నెల 18న పాడా కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లోనూ వినతిపత్రం అందించామని తెలిపారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెబుతున్నారు. పాలకులు, అధికారులు మారుతున్నా తమ సమస్యకు మాత్రం పరిష్కారం చూపటంలేదని వాపోయారు. నీటి ట్యాంకు ఏర్పాటు చేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంత్యక్రియలకు మరింత భూమిని కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలి...
ఉన్న కొద్దిపాటి స్మశాన స్థలంలోనూ కొంత ఆక్రమణకు గురైంది. దీంతో, పాతిపెట్టిన మృతదేహాన్ని తీసి అక్కడే మరో మృతదేహాన్ని పూడ్చి పెట్టాల్సి వస్తోంది. తక్షణం అధికారులు స్పందించి సర్వే నిర్వహించాలి. ఆక్రమణ నుంచి కాపాడాలి. మరింత భూసేకరణ చేయాలి. స్మశానానికి సరిహద్దులు నిర్ణయించి ప్రహరీ నిర్మించాలి.
- పెదపూడి రవి, జీవన్ నగర్, పిఠాపురం
రహదారి సౌకర్యం కల్పించాలి...
స్మశానవాటికు వెళ్లేందుకు సరైన రహదారి లేదు. కాలువలో దిగి మృతదేహాల తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నాము. తక్షణం కల్వర్టు, రోడ్డు నిర్మించాలి. స్మశాన వాటికలో మౌలిక వసతులు కల్పించాలి.
- ఏడిద రాములు, జీవన్ నగర్, పిఠాపురం










కామెంట్లు (0)