శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వాతంత్ర దినోత్స‌వానికి ఎర్ర‌కోట‌ ముస్తాబు

1 గంట క్రితం

freedom
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఐదు వేల మంది ప్ర‌త్యేక ఆహ్వానితులు

- జెండా పండుగ‌కు ఏర్పాట్లు పూర్తి

ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : దేశం 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజ‌ధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుంచి ఈ వేడుకలకు నేతృత్వం వహించనున్నారు. భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లతో సభా ప్రాంగణంపై పూలవర్షం కురిపిస్తారు. 21 గన్ సెల్యూట్‌తో ఏకకాలంలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. పూల జల్లు అనంతరం, ప్రధానమంత్రి ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్ల వారసత్వాన్ని పురస్కరించుకుని, 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్ దిశగా నడిపించడంలో యువశక్తి ఆకాంక్షలు, కీలకమైన సహకారాన్ని వేడుకగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకల్లో మొదటిసారిగా వందేమాతరం గీతాన్ని ఆలపించనున్నారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపిస్తారు, అనంతరం జాతీయ గేయం కూడా ఆలపిస్తారు. ఈ వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మొత్తం 2,500 మంది బాలురు, బాలికల క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు పాల్గొంటారు. ఎర్రకోటలో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన సుమారు ఐదు వేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. జాతీయ రాజధానిలో ఢిల్లీ పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ ఏజెన్సీలకు చెందిన సుమారు 15 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట వద్ద వెయ్యి సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేశారు. పౌరులలో దేశభక్తిని పెంపొందించడానికి, స్వాతంత్య్ర‌ దినోత్స వాన్ని జరుపుకోవడానికి, దేశవ్యాప్తంగా 343 ప్రముఖ ప్రదేశాలలో బ్యాండ్ ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, హైకోర్ట్, ఎర్రకోట సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపు

దేశం ఒకపక్క స్వాతంత్య్ర వేడుకలకు సిద్దమవుతుంటే.. మరోపక్క దేశ రాజధానికి మాత్రం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని ఎయిర్‌పోర్టు, ఎర్రకోట, హైకోర్ట్‌ సహా కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందుకు సంబంధించి శుక్రవారం అధికారులకు ఒక ఈమెయిల్ వచ్చింది. దీనిలో ఢిల్లీలోని కోర్టులు, రైళ్లలో పేలుళ్లకు పాల్పడతామని హెచ్చరించారు. ఆగష్టు 15న ఈ పేలుళ్లు జ రుపుతామని మెయిల్‌లో ఉంది. అందులోనూ ఢిల్లీ హైకోర్టును ఆగష్టు 15న మధ్యాహ్నం 2.11 గంటలకు పేల్చేస్తామని కూడా పేర్కొన్నారు. ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే సమయంలోనే దాడులకు పాల్పడతామని ఆగంతకులు ఆ మెయిల్‌లో హెచ్చరించడం సంచలనంగా మారింది.

ఢిల్లీని ఖలిస్తాన్‌లో భాగంగా చేయాలనే లక్ష్యంతో ఈ పేలుళ్లు జరుపుతామని మెయిల్‌లో పేర్కొన్నారు. సిక్కులకు న్యాయం చేయడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైనట్లు, అందులోనూ 1984లో జరిగిన సిక్కు అల్లర్ల కేసులో బాధిత సిక్కులకు కోర్టు న్యాయం చేయలేకపోయిందని, అందుకే ఢిల్లీ హైకోర్టును టార్గెట్ చేశామని మెయిల్‌లో వివరించారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌ 3ని పేల్చేస్తామన్నారు. జామ్‌నగర్ హౌజ్, ఝండేవాలన్ బిల్డింగ్ వంటివాటికి కూడా బాంబు ముప్పు ఉంది. ఈ బాంబు హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించారు. బాంబు బెదిరింపులు ఉన్న ప్రదేశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లలో తనిఖీలు చేపడుతున్నారు. ఇతర పబ్లిక్ ప్రదేశాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న ఐపి అడ్రస్ ఏంటనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీస్ డ్రస్‌లో వస్తారన్న హెచ్చరికల నేపథ్యంలో.. భద్రతా విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను పునఃపరిశీలించడం, తనిఖీలు చేపట్టడం ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్