శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వాతంత్ర్య దినోత్సవ శంఖారావం

59 నిమిషాల క్రితం

modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 05:45 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

79 సంవత్సరాల కిందట మనం ఆశల వసంతాగమన పండుగ చేసుకున్నాం. మనకు అత్యుత్తమ వేళ అది. ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ అర్ధర్రాతి నిశీథివేళ అందరి మనస్సులలో తొణకిసలాడిన భావాన్నే వినిపించారిలా... ‘‘భవిష్యత్తుకు మనం చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవలసిన సమయం’’ అన్నారు. ఒక నూతన దేశాన్ని నిర్మించుకోవాలని మన కర్తవ్యం నిర్దేశించింది. సువిశాలమైన వైవిధ్యభరితమైన భారతదేశం వలసవాద గుదిబండను వదిలించుకుని ఎన్నడూ లేనంత ఐకమత్యంగా నిలిచింది. దేశ విభజన విషాదాలకు కారణమైన శక్తులను అధిగమించి మనం సమైక్యంగా నిలవడమే విద్యుక్త ధర్మంగా వచ్చిన పరిస్థితి. మనం చేపట్టిన బృహత్తర కర్తవ్యాన్ని చూసి యావత్‌ ‌ప్రపంచ ప్రజానీకం విస్మయం చెందారు. మన జనాభా పరిణామం, వారిలో వైవిధ్యాలు చారిత్రక సవాళ్లుగానే వున్నాయి. రాజ్యాంగ పరిషత్తు సభ్యులుగా వ్యవహరించిన మన స్వతంత్ర యోధులు దీనికి ఒక తేలికైన పరిష్కారం కనుగొన్నారు. అదే పౌరసత్వం అనే సాధనం. విభిన్న మతాలు, భాషలు, కులం, సంస్కృతి, ప్రాంతీయ అసమానతలు వంటి వాటితో ముక్కలై వున్న వైవిధ్య భరిత ప్రజానీకం భారతీయ పౌరులుగా సమాన ఉమ్మడి పౌరసత్వం పొందగలిగారు.​

సంక్లిష్టతలు తీవ్రతరం

ఇప్పుడు మనం వెనక్కు తిరిగి చూసుకుంటే నాటి మన ఆశావసంతం స్థానంలో అసంతృప్తి శీతల మేఘాలు అలుముకోవడం కనిపిస్తుంది. అత్యంత ఘోరమైన కాలంగా చెప్పదగిన కాలంలో అత్యధిక ప్రజానీకం చిక్కుకుపోయి వున్నారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఆర్థిక అసమానతలు అలుముకున్న వాస్తవం మనల్ని పట్టి కుదుపుతున్నది. ఏదో కొద్ది మంది కుబేరులు, సర్కారీ దన్ను కలిగిన కార్పొరేట్లు మాత్రమే చుక్కలు తాకేంత సంపదలు గుట్టలు పోగుపోసుకుంటున్నారు. ఆ ఒక్క శాతం దేశంలో 40 శాతం సంపద అనుభవిస్తున్నారు. మరో సగం మంది జనం అనాథలుగా కనీస జీవన స్థాయికి దిగువన బతుకులీడుస్తున్నారు. విద్యా వైద్యాలు అందకుండా పోయి అంతకంతకూ కునారిల్లుతున్నారు. శారీరక సామర్థ్యం వుండి కూడా నిరుద్యోగులుగా అరకొర ఉద్యోగులతో వట్టిపోతున్నారు. ఎప్పటికీ అందని ఉద్యోగావకాశాల కోసం పట్టభద్రులు, ఆ పై చదువుల ఉన్నత విద్యావంతులు, పరిశోధక డాక్టర్లు బారులు కట్టే సంఖ్య ప్రపంచంలోకెల్లా బహుశా భారతదేశంలోనే అత్యధికంగా వుంటుంది. ఇలాంటి పరిస్థితి మటుమాయం చేయలేని ఘర్షణలకు దారితీస్తుందని చెప్పడానికి పెద్ద మహావిజ్ఞానులు కానక్కర్లేదు. ఇది దేశంలో అంతర్గత వ్యవస్థాగత సంక్లిష్టతలను ఇంకా తీవ్రం చేస్తుంది. కేవలం మరింత అరమరికలు లేకుండా మాట్లాడుకోవడం ద్వారా మాత్రమే అలాంటి ఘర్షణలు, ఉద్రిక్తతలు ఉపశమిస్తాయి. ​

వారెప్పుడూ వేరే!​

రాజ్యాంగంలో మనం రూపొందించుకోవాలని, తీర్చిదిద్దుకోవాలని ఎంచుకున్న ప్రజాస్వామ్య భావనతో ప్రస్తుత పాలక వ్యవస్థ భాగం పంచుకోలేదు. ఇప్పుడు నాటకం నడిపిస్తున్నామని భావించే సూత్రధారులుగా చెప్పుకునే వారి సైద్ధాంతిక పితామహులకు ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులంటేనే ఎప్పుడూ ఏహ్యభావం. ఏకపక్ష ఆధిపత్యం, సర్వ కేంద్రీకరణ, ప్రజలకూ రాష్ట్రాలకూ నామమాత్రపు అధికారాలు వుండాలనే విశ్వాసానికి విధేయులు వారు. భారత దేశం వంద చిన్న చిన్న విభాగాలుగా వుండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వాదించింది. భారతీయ సమాజంలో వ్యక్తమయ్యే సహజసిద్ధ భిన్నత్వాన్ని తోసిపుచ్చి తమ ఏకపక్ష నిర్దేశాన్ని రుద్దడమే ఇందులో ఆంతర్యం. విశాల ప్రజారాశులపై అసమానతలు, అగచాట్లు కుమ్మరించే విధంగా ఆర్థిక అయోమయం సృష్టించిన వారు తాము అధికారంలోనే కొనసాగడం కోసం ప్రజలలో విభజనలు తీసుకురావాలని చూస్తున్నారు. ఆర్థిక అసమానతల కారణంగా అట్టడుగున వున్న ప్రజలు ఆర్థిక సామాజిక సంక్షేమం మృగ్యమై పోయింది. దీనివల్లనే మన దేశ స్వాతంత్రం, రాజకీయ సార్వభౌమత్వం ముప్పునెదుర్కొనే పరిస్థతి ఏర్పడింది. విభజన కార్యకలాపాలకు కావలసిన భూమిక ఏర్పడింది.​

మన దేశ స్వాతంత్య్ర సమయంలో మన సార్వభౌమత్వాన్ని దృఢతరం చేసుకోవడం కోసం వలస వ్యవస్థ విచ్ఛిన్నం, స్వతంత్ర విదేశాంగ విధానం మార్గంగా ఎంచుకున్నాము. ఇది అద్భుతమైన ఫలితాలిచ్చింది. పేదరికం, అభివృద్ధి లేమితో కష్టాలనెదుర్కొంటున్న నవ స్వతంత్ర దేశాల ఆకాంక్షల సాధనలో మనం అగ్రభాగాన నిలిచాం. సామ్రాజ్యవాద పెత్తనాలను ఎదుర్కొంటూ శాంతి కోసం పోరాడటమే ఆ విధానానికి మూల సూత్రంగా వుందంటే అదేమీ యాదృచ్ఛికం కాదు.​

ఇరాన్‌ పై యుద్ధం తర్వాత...

అయితే ఈ రోజున ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆ విధానాన్ని వదిలేసింది. అమెరికా సామ్రాజ్యవాదంతో నిర్ణయాత్మకంగా జతకట్టే విధంగా మారింది. ఇజ్రాయిల్‌ ‌బిగి కౌగిలిలో చేరడం వారు ఎంచుకున్న ఒక మార్గం. గాజాలో ఇజ్రాయిల్‌ ‌మారణకాండ, వెస్ట్ బ్యాంక్, జెరూసలేం ఆక్రమణ పథకాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇజ్రాయిల్‌‌తో, అమెరికా-ఇజ్రాయిల్‌ ‌కూటమితో ఇంకొందరు కూడా ఏకీభవించారు. అయితే ఇరాన్‌‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ ఒక్కటిగా యుద్ధం చేయడంతో ఇది మారింది. ఇరాన్‌ సైనిక ‌ప్రతిఘటన స్థాయి, కేవలం ఇజ్రాయిల్‌నే గాక మొత్తం గల్ఫ్‌‌లో అమెరికా స్థావరాలన్నిటినీ ఢీకొనడంతో ఈ ప్రాంతంలో దీర్ఘ కాలంగా కొనసాగుతున్న అమెరికా ఆధిపత్యానికి గండి పడినట్టయింది.​

భారత దేశమే గనక స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించుతున్నట్టయితే ఈ సైనిక ఘర్షణ పరిష్కారంలో దౌత్యపరమైన పాత్ర నిర్వహించగలిగి వుండేది. ఇది భారత దేశ ఇంధన భద్రతను దెబ్బ తీయసాగింది. ఇరాన్‌, రష్యాల నుంచి చమురు సహజ వాయువులు హర్మూజ్‌ ‌జలసంధి ద్వారా సరఫరా కాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది మన వంటిళ్లను దెబ్బతీసింది. అయితే కోరికోరి అమెరికాకు లోబడిపోవడం, నక్కజిత్తుల ఇజ్రాయిల్‌ విషయంలో అగమ్య స్థితికి లోనవడం మనను పూర్తిగా చిక్కుల్లో పడేసింది. మన రాజకీయ సార్వభౌమత్వమే అలాంటి గడ్డు స్థితిలో పడటంతో మనం ప్రధానంగా అమెరికా నుంచి మరిన్ని ఒత్తిళ్లకు గురికావలసిన స్థితి ఏర్పడింది. సుంకాలు, వాణిజ్య విధానాల విషయంలో మన ఎగుమతులు దెబ్బతినగా మన మార్కెట్లలోకి దిగుమతులకు అనుకూలత ఏర్పడింది. దానివల్ల మన శ్రామికులకు ప్రత్యేకంగా రైతులకు ఇది విపరీత పర్యవసానాలు కల్పించింది.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం‌తో చేటు​

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడైనా మెజారిటీ మతాధిక్యవాద సిద్ధాంతాన్ని, బ్రాహ్మణీయ ఆచార పద్ధతులను సామాజిక దృక్పథంగా ప్రతిపాదిస్తున్నది. మన స్వాతంత్రానికి సాగిపోయే క్రమంలో విభిన్న అస్తిత్వాలకు లోటు లేకపోయినా అందరినీ కలుపుకుని సమ్మిళితం చేయడంపైనే ఎప్పుడూ ప్రయత్నం జరిగింది. ఆర్‌ఎస్‌ఎస్‌ విషయానికొస్తే విభజించడం, వెలిపెట్టడం విధానంగా వుండేది. ప్రస్తుతం అన్ని రాజ్యాంగ వ్యవస్థలలో బిజెపి ద్వారా దానికి లభించిన రాజకీయాధిక్యత స్థాయిని బట్టి ఇప్పడు అంతర్గత ఘర్షణలు పరాకాష్టకు చేరుతున్నాయి. ఆదివాసులు, దళితులు, ముస్లింలు, మహిళలు అందరికన్నా ఘోరంగా నష్టపోతున్నారు. వీటికి సమర్థనగా పాతకాలపు పురాణాలను తీసుకురావడం జరుగుతున్నది. తమ సైద్ధాంతిక విధానాన్ని మొత్తంగా సమర్థించుకోవడం కోసం మరిన్ని వక్రీకరణలు జోడించబడుతున్నాయి.​

అందువల్ల ఈ స్వాతంత్ర్య దినోత్సవం మన ప్రజల సమైక్యత, సమ్మిళిత భావన కోసం పోరాడేందుకు పునరంకితమవ్వాలనే సందేశం ఇస్తున్నది. మెజారిటీవాద విధానాలలో ఆధిపత్యం, అది కూడా ముఖ్యంగా బలప్రయోగం ద్వారా ఆధిపత్యం వహించడం అంతర్భాగంగా వుంటుంది. రాజ్యాంగంలో స్వతంత్రమైనవిగా చెప్పబడిన వ్యవస్థలను మాయోపాయాలతో లోబర్చుకోవడం ద్వారా ఈ ప్రాబల్యం చిక్కుతుంది. అయితే ప్రస్తుత ఆధిక్యత తర్కబద్ద ప్రభావం మేరకు అవి తమ ఆధిక్యతను రుద్దేవిగా వుండకపోతే వాటి స్వతంత్రత అనేదాన్ని విశ్వసించదు, అలాంటి మాయోపాయాలకు అతి పెద్ద కేంద్రంగా ఎన్నికల సంఘం (ఇసిఐ) కనిపిస్తున్నది. ఓటరు జాబితాల మాయజాలం ఏ స్థాయికి చేరిందంటే ఇప్పుడు ఓటర్లు తాము కోరుకున్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంగాక ప్రభుత్వం తన ఓటర్లను ఎంచుకునే పరిస్థితి వచ్చింది. ప్రజలకు హామీ ఇవ్వబడిన ఓటు హక్కు ఇందుకు ఫణంగా పెట్టబడుతున్నది.​

భయోత్పాత వాతావరణం సృష్టించడం ద్వారా కూడా ఆధిపత్యం రుద్దబడుతున్నది. ఈ సైద్ధాంతిక చట్రానికుండే నయా ఫాసిస్టు లక్షణాలను పూర్తి స్థాయిలో ప్రయోగించడం జరుగుతున్నది. ప్రతిపక్షాన్ని, విమర్శనూ నోరు నొక్కడం, ప్రత్యక్షంగా ఆలోచనలను మొద్దుబార్చడం ద్వారానూ ఇది జరుగుతుంది. ఇందుకోసం కార్పొరేట్‌ ఆధిపత్యంలోని ‌ ప్రధాన గోడీ మీడియా ద్వారానూ బిజెపి ఐ.టి విభాగం సోషల్‌ ‌మీడియావరణంలోకి వదిలే ఫేక్‌ ‌సమాచారం ఇందుకు సాధనంగా వుంటుంది.

ఆశాకిరణం​

అనివార్యంగా సంభవించనున్నదాన్ని వ్యతిరేకించి పోరాడవలసిన, ప్రతిఘటించవలసిన ఆవశ్యకత మనకు ఎదురవుతున్నది. ఈ సమస్యలోనే మనం ఇటీవల యువజనుల జెన్‌ ‌జి నిరసనను చూశాం. తమ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి పరీక్షలే ఆఖరి అవకాశంగా ఉన్న నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా ఈ నిరసన మొదలైంది. సోషల్‌‌ మీడియావరణం నుంచి ఆ నిరసన పుట్టుకొచ్చింది. ప్రధానంగా డిజిటల్‌ ‌వేదికల నుంచి పాటలు, రీళ్లు, జోకులు, మీమ్‌‌లతో అది ఆవిర్భవించింది. స్వాతంత్రానికి, మన రాజ్యాంగ భావనల మూలాలకే ముప్పు తెచ్చే పాలనా రీతిని పూర్తిగా నవ్వుల పాలు చేసింది.​

భయం కరిగిపోయి అరుదైన ధైర్యం ప్రదర్శించబడటంతో ప్రభుత్వం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్టు కనిపిస్తుంది. బహుశా వచ్చే ఏడాది వంద పువ్వులు వికసించి మనం 79 ఏళ్ల కిందట రూపొందించుకున్న స్వతంత్ర భావనను నిజం చేయవచ్చునని ఆశించాలి. సవాళ్లు చాలా తీవ్రమైనవే కానీ మనకు ఒక ఆశాకిరణం మిణుకు మిణుకుమంటున్నది.​


(‘పీపుల్స్‌ ‌డెమ్రోకసీ’ సంపాదకీయం, ఆగష్టు 12)



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్