- సిపిఎం జిల్లా కార్యదర్శి గొంతు నులిమిన పట్టణ ఎస్‌ఐ
- పిడిగుద్దులు కురిపించిన పోలీసులు
ప్రజాశక్తి-మార్కాపురం : తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ‘వంటా..వార్పు’ ఆందోళన చేస్తున్న వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వారికి మద్దతుగా నిలిచిన సిపిఎం శ్రేణులపై అమానుషంగా వ్యవహరించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్యను లక్ష్యంగా చేసుకుని పోలీసులు విరుచుకుపడ్డారు. దీంతో మార్కాపురం జిల్లా కలెక్టరేట్ వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఆందోళనలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆగకుండా దురుసుగా ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ ఆందోళనలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి. రమాదేవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కలెక్టరేట్ గేటు సమీపంలో పొయ్యి వెలిగించి వంట వార్పు చేపట్టిన వందలాది మంది నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని పెద్దపెట్టున నినదించారు. మార్కాపురం సిఐ అల్తాఫ్ హుస్సేన్, మార్కాపురం పట్టణ ఎస్ఐ పి.విశ్వనాథరెడ్డి, మార్కాపురం రూరల్ ఎస్ఐ వి.వేమన సివిల్ పోలీసులు, స్పెషల్ పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కలెక్టరేట్ ఎదుట వంటా - వార్పు చేయడానికి వీలు లేదంటూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు - నిర్వాసితు ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి సోమయ్యను చుట్టుముట్టిన పోలీసులు సిమెంట్ రోడ్డుపై ఆయన్ను మీటర్ల కొద్ది ఈడ్చుకుంటూ వెళ్లారు. అంతటితో ఆగని పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి సోమయ్య గొంతు నులిమే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనకు ఊపిరి ఆడనంత పనైంది. అయినా, ఆయన్ను ఆటోలో తరలిస్తుండగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి, మరికొందరు నిర్వాసితులు అడ్డుపడ్డారు. రోడ్డుపై అడ్డంగా పడుకున్నారు. అడ్డుపడిన వారందరినీ పోలీసులు లాగి పడేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సోమయ్య ఆచూకీ కూడా తెలియలేదు. తుర్లపాడు పోలీస్ స్టేషన్లో ఉంచిన ఆయన్ను సాయంత్రం మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి ఇద్దరి హామీతో విడుదల చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా, పునరావాసం పూర్తిస్థాయిలో కల్పించకుండా, ప్యాకేజీ కొందరికే ఇచ్చి, 18 ఏళ్లు నిండిన యువతను గాలికి వదిలేసి హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అధికారుల మాటల నమ్మి ఉన్న ఊరును వీడిన నిర్వాసితులు చెట్టుకొకరు పుట్టకొకరులా మిగిలిపోయారు. పునరావాస కాలనీలు నేటికీ కొన్ని పూర్తి కాలేదు. కల్పించాల్సి ఉంది. కనీసం తాగునీటి వసతులు కూడా మచ్చుకైనా కానరావడం లేదు. కొందరికి పునరావాస కాలనీలలో ఇంటి పట్టాలు ఇచ్చిన స్థలం ఎక్కడో చూపనేలేదు. ముంపు గ్రామాలలోని నిర్వాసితులంతా కొందరు అద్దె ఇళ్లలో, అద్దె ఇల్లు దొరకని వారు ఇంకొందరు బంధువుల ఇళ్లలో, ఆ బంధువుల వద్ద కూడా అవకాశం లేని వారందరూ చెట్టు కింద, తాత్కాలికంగా వేసుకున్న గుడిసెలలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యల పరిష్కారం, ప్యాకేజీ కోసం వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతోంది.








కామెంట్‌లు (0)