- డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు
- విజయవాడలో సామాజిక శంఖారావం మహాధర్నా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వాలు కుల వివక్షకు పాల్పడుతున్నాయని దళిత శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో కెవిపిఎస్, వ్యవసాయ కార్మక సంఘం, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘సామాజిక శంఖారావం మహాధర్నా’ ను మంగళవారం నిర్వహించారు. ఈ మహాధర్నాకు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుడి.రమాదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కొత్త కొత్త రూపాల్లో కుల వివక్షత కొనసాగు తోందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ పార్ట్ టైం ఉపాద్యాయులు, అధ్యాపకులు 20 ఏళ్లుగా పని చేస్తున్నా అరకొర జీతాలు ఇచ్చి పని చేయించు కుంటున్నారని అన్నారు. ఆకివీడులో వీడులో 2 వేల మంది దళితుల ఇళ్లని కూల గొట్టారని, దళితుల దేవత గొంతేనమ్మ గుడిని కూల్చి, రామాలయం నిర్మించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దీనికి అనుకూలంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ ఘటనలు ప్రభుత్వ కుల వివక్షతకు ఉదాహరణలుగా నిలుస్తాయన్నారు. భూస్వాములు, పెత్తందార్లు, కుల దరహంకారులు మాత్రమే కాకుండా వీరికి అండగా ప్రభుత్వం కుల వివక్షకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. దళితులకు శ్మశాన వాటిక ఏర్పాటు కోసం 1235 జిఒ జారీ చేసినా దానిని అమలు చేయడం లేదన్నారు. కార్పోరేట్ సంస్థలకు లక్షల ఎకరాలు దారాదత్తం చేస్తున్న పాలకులు దళితులకు మాత్రం శ్మశాన వాటికల కోసం 2 ఎకరాలు కేటాయించడం లేదన్నారు.దాదాపు 16 వందల గ్రామాల్లో సర్వే చేయగా, 960 గ్రామాలలో శ్మశాన వాటికలు లేవన్నారు. 20 శాతానికి శ్మశాన వాటిక లు ఉన్న మౌలిక సదుపాయలు లేవని, సామాజిక శంఖారావంలో గుర్తించారన్నారు. చాలా చోట్ల ఒక శవంపై మరో శవాన్ని పూడ్చుతున్నారని అన్నారు అనంత్ అంబానికి 5 లక్షల ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు కేటాయించారని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో చేసిన పోరాటాల ఫలితంగా అసైన్డ్ భూములు ఇస్తే అవన్నీ పెద్దలు చేతుల్లోకి వెళ్లాయన్నారు. వీటిని రెగ్యులర్ చేయడానికి 22ఎ చట్టాన్ని సవరించారన్నారు. విజయవాడలో 5 ఏళ్ల కిందట పట్టాలు ఇచ్చిన వారికే మళ్లీ పట్టాలిస్తున్నారని, ఇవి ఎందుకు పనికిరావని చెప్పారు. దీనికి పట్టాభిషేకం అని పేరు పెట్టడాన్ని ఆయన ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో 60 లక్షల పేదకుటుంబాలు ఉన్నాయని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారని, అవి ఏమయ్యాయని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ నూరు శాతం అమలు చేశాం, ఇక చేయాల్సింది ఏమీ లేదని చెబుతున్నారని అన్నారు. అదే సమయంలో కార్పొరేట్లకు మాత్రం చేయవలసిన సేవ ఇంకా మిగిలే ఉందని చెప్పారు. స్పందన లేని స్పందన కార్యక్రమాలు వృధా అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో పదవులు పొందిన దళితుల పరిస్థతి దారుణంగా ఉందన్నారు. వారికి ఎక్కడా గౌరవం లభించడం లేదన్నారు. గుంటూరు జిల్లాలో దళిత యువకుడిని విచారణ పేరుతో తీసుకువెళ్లి పోలీసులు కొట్టిచంపేశారని మంగళగిరిలో లారీ యజమానులు నేరం మోపి మరో దళితుడిని చంపేశారన్నారు. ఈ హత్యలన్నీ లెక్కలోకి రాకపోవడంతో క్రైమ్ రేటు తగ్గిందన్నారు. ప్రస్తుతం కుల వివక్ష తీవ్ర రూపంలో ఉందన్నారు. మతం మత్తు మందు నుంచి బయట పడాలన్నారు. ఆర్ఎస్ఎస్ ‘గడపలోపల కులం-గడపదాటితే హిందువులం’ అని చెబుతోందని, గడపలోపల కులం ఉండకూడదని, కుటుంబం ఉంటుందని చెప్పారు. కుల వివక్షను పెంచి పోషించే మను ధర్మాన్ని సమర్ధించే వాళ్లు ఢిల్లీలో పాలకులు అయ్యారని, వారిని రాష్ట్రంలోని టిడిపి, జనసేన పార్టీలు నెత్తిన పెట్టకున్నాయని చెప్పారు.
జనం ఎలాగూ ఓట్లు వేయరని గ్రహించి, ఎస్ఐఆర్ తో జనానికే ఓటు లేకుండా చేస్తున్నారని చెప్పారు. రూ.16 లక్షల కోట్లు కార్పోరేట్లకు రుణాలు రద్దు చేశారని, రూ.5 లక్షల కోట్లు పన్నుల మాఫీ చేశారని, రాష్ట్రంలో ఉన్న వనరులన్నింటిని లూటీ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వనరులను వాడుకుని కరెంట్ ఉత్పత్తిచేసి యూనిట్ రూ.2.50కు అమ్ముతుంటే, అదే విద్యుత్ ను రూ.1కే అదాని సంస్థలకు ఇస్తున్నారని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో రూ.3 వేల కోట్లను బిజెపి, ఆర్ఎస్ఎస్ అవినీతికి పాల్పడ్డారన్నారు. గత మూడు మాసాలుగా రాష్ట్రంలో కుల వివక్ష అంతం కోసం సామాజిక శంఖారావాన్ని నిర్వహిస్తున్న కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం, వారికి సహకరిస్తున్న ఇతర సంఘాలను అభినందించారు. ఇది ఇప్పటితో ఆగదని, నిరంతరంగా కొనసాగుతుందన్నారు. రెండవ దశలో డిసెంబరు, జనవరిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పూనుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఉద్యమానికి డిఎస్ఎంఎం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం దళితులకు శ్మశాన వాటికలను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని, హక్కుల కోసం పోరాడితేనే న్యాయం లభిస్తుందన్నారు. లొంగిపోవడం కంటే బానిసత్వమే మేలన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి మాట్లాడుతూ, ఈ ఉద్యమంలో మహిళలను భాగస్వాములు చేయాలన్నారు. సిఎం సొంత నియోజకవర్గం కుప్పంలో అంటరాని తనం కొనసాగుతోందని, కులాంతర వివాహాలు చేసుకున్న వారిని హత్య చేసిన సంఘటలు ఉన్నాయని చెప్పారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. సామాజిక శంఖారావంతో గుర్తించిన కొన్ని కీలక సమస్యలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి సమర్పించామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ, రెండున్న ఏళ్లలో దళితుల సమస్యలపై ఈ మంత్రి వర్గానికి ఒక్కసారి కూడా చర్చించే తీరిక లేకపోవడం శోచనీయమన్నారు. అంతకు ముందు శవపేటికలతో శవయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి నాగేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరామ్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్నకుమార్, వ్యవసాయ కార్మక సంఘం రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వర్లు, దడాల సుబ్బరావు, కంకణాల ఆంజనేయలు, వి. శివనాగరాణి, వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు యం.భాస్కరరావు, న్యాయవాధులు నాగేశ్వరరావు, కుటుంబరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ మహాధర్నాలో పలు జిల్లాల్లో వివక్ష ఎదుర్కొంటున్న బాధితులు వారు ఎదుర్కొంటున్న వివక్షను, సమస్యలను వివరించారు.








కామెంట్‌లు (0)