ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బాక్సైట్ జోలికొస్తే తరిమికొట్టాలి

5 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 01:20 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- తవ్వకాలతో గిరిజనుల ఉనికికే తీవ్ర ప్రమాదం

- అసంపల్లి వద్ద బహిరంగ సభలో శ్రీనివాసరావు

- భారీగా తరలొచ్చిన ఆదివాసీలు

ప్రజాశక్తి- చింతపల్లి, జికె.వీధి (అల్లూరి జిల్లా) : ‘ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి అశాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తే కార్పొరేట్ కంపెనీలు ఏజెన్సీలోకి ప్రవేశించి గిరిజనుల ఉనికికే ముప్పు ఏర్పడుతుంది. గిరిజనుల జీవనం, విద్య, ఉపాధి, భవిష్యత్తు అన్నీ ప్రమాదంలో పడతాయి’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాక్సైట్‌ ‌జోలికొస్తే అందరూ ఐక్యంగా తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జికె.వీధి మండలం జర్రెల పంచాయతీ పరిధి అసంపల్లి గ్రామ శివారులోని మిట్టపనుకు కొండపై సిపిఎం ఆధ్వర్యాన శనివారం భారీ బహిరంగ సభ జరిగింది. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు, రైతులు, మహిళలు తరలివచ్చారు. బాక్సైట్ తవ్వకాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 2002లో బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదన వచ్చినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, గిరిజనులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించి అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టబోమని 2019లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ తవ్వకాలను తెరపైకి తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులు ఎవరూ బాక్సైట్ తవ్వకాలను కోరలేదని, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందన్నారు. అటవీ ప్రాంతాలు గిరిజనుల జీవనాధారమని, బాక్సైట్ తవ్వకాల వల్ల అడవులు నాశనమై ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందన్నారు. జలవనరులు కలుషితమవడంతో పాటు వ్యవసాయం దెబ్బతిని గిరిజనుల సంప్రదాయ జీవన విధానం సంక్షోభంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాక్సైట్‌ ‌తవ్వకాల కోసం ప్రయత్నిస్తున్నాయని, ఈ క్రమంలోనే మట్టి నమూనాలు సేకరిస్తున్నారని తెలిపారు. గ్రామసభలు, పీసా కమిటీ తీర్మానాలు లేకుండా రహస్య సర్వేలు నిర్వహించడం సరికాదన్నారు. సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి జెడ్‌‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు చిన్నయ్య పడాల్‌, బాలదేవ్‌, ధర్మాన పడాల్‌, బుజ్జిబాబు పాల్గొన్నారు. సభకు ముందు ఆదివాసీలు ర్యాలీ నిర్వహించారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నినదించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్