ప్రజాశక్తి నూతన వెబ్‌సైట్ ఆవిష్కరణలో ఎఎన్‌యు మాజీ విసి ఆచార్య వియన్నారావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న విచ్ఛిన్నకర ధోరణులను తిప్పికొట్టాలని, ఇందుకోసం నిజాయితీ, ధైర్యంతో కూడిన ప్రజాశక్తి లాంటి సంస్థలు చేస్తున్న కృషి అత్యంత కీలకమైందని ఆచార్య నాగార్జునా యూనివర్శిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె వియన్నారావు అన్నారు. ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు (ఎంహెచ్) 25వ వర్థంతి సందర్భంగా గురువారం విజయవాడ ఎంబివికెలో ప్రజాశక్తి నూతన వెబ్ సైటును వియన్నారావు ఆవిష్కరించారు. తొలుత ఎంహెచ్ చిత్రపటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్, ప్రముఖ ప్రజా వైద్యులు ఎంహెచ్ గారి అల్లుళ్ళు డాక్టర్ ఎన్ రంగారావు, డాక్టర్ ఎస్ సుధాకర్ తో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తులసీదాస్ అధ్యక్షతన జరిగిన సభలో ఆచార్య వియన్నారావు మాట్లాడుతూ వామపక్ష భావజాలంతోనే దేశాన్ని ముందుకు తీసుకెళ్ల వచ్చని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రజాశక్తి లాంటి మీడియా సంస్థల పాత్ర కీలకమని అన్నారు. విశ్వ విద్యాలయాల్లో గతంలో వామపక్ష భావజాల విద్యార్థి సంఘాలు అభ్యుదయ పాత్ర పోషించేవని తెలిపారు. నిజాయితీగా పోరాడే ధైర్యం ఉన్న వ్యక్తులను. జర్నలిస్టులు ప్రోత్సహించాలని, ఈ విషయంలో ఎంహెచ్ స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రింట్ మీడియాతోపాటు నేడు డిజిటల్ మీడియాకు కూడా అధిక ప్రాధాన్యత వచ్చిందని, సంస్థ వెబ్ సైట్ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందించాలని కోరారు.
దోపిడిని నిలదీస్తున్న యువతరం : వి శ్రీనివాసరావు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో డిజిటల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, మోడీ దాన్ని వినియోగించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు దాన్నే టార్గెట్ చేశారని అన్నారు. దేశాధినేతగా ఉండి మనదేశ భవిష్యత్ ను మరొక దేశం ముందు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా యువత ముందుకొస్తోందని, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగానూ పోరాడుతున్నారని, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో సుందరయ్ పిచాయ్ ప్రసంగాన్ని భహిష్కరించారని తెలిపారు. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ కు సాంకేతికతను అందించడంపై యువతలో ఆగ్రహం వ్యక్తమైందని వివరించారు. అలాగే అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశాలను కూడా బయటకు రానీయడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను నేడు అనేక మీడియా సంస్థలకు బయటకు రానీయకుండా తొక్కిపెడుతున్నాయని తెలిపారు. ప్రజాశక్తి లాంటి సంస్థలు ఇలాంటి విషయాలను నిర్భయంగా ప్రజలకు అందిస్తున్నాయని అన్నారు. అలాగే నిర్భయంగా వార్తలు ప్రపంచానికి తెలిపే జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన అవసరమూ ఉందని పేర్కొన్నారు. మతోన్మాదాన్ని విస్తృతంగా ముందుకు తెస్తున్నారని, దీన్ని పెంచి పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ కు బిజెపి అనుబంధ సంఘంగా పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో సర్ కు అనుకూలంగా వ్యవహరించి ఇక్కడ సర్ గురించి పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయని అన్నారు. మహిళా రిజర్వేషన్ల విషయంలోనూ టిడిపి, వైసిపి కేంద్రానికి అనుకూలంగా వ్యవహరించాయని తెలిపారు. ఇలాంటి ద్వంద్వ వైఖరులను నిర్భయంగా ప్రజల ముందు ఉంచాలని అన్నారు. ఇటువంటి విషయాలను నిర్భయంగా అందిస్తున్న ప్రజాశక్తిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రపంచంలో వస్తున్న పరిమాణాలపై పెట్టుబడిదారుల కోణంలో అనేక పత్రికలు వార్తలు రాస్తున్నాయని, ప్రజల కోణంలో ప్రజాశక్తి మాత్రమే రాస్తోందని తెలిపారు. అమరావతి రాజధాని, పోలవరం, అవినీతి అక్రమాలపై ప్రజాశక్తిలో వస్తున్న వార్తలకు వాస్తవాలకు దగ్గరగా ఉంటున్నాయని వివరించారు. జి7 దేశాల సమావేశంలో మూడో ప్రపంచ దేశాలను అణచడం ఎలా అనే అంశంపై చర్చ జరుగుతుంటే కొన్ని పత్రికలు అసలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ప్రబీర్ పుర్కయస్థ మీద అక్రమ కేసుపెట్టి 227 రోజులు జైల్లో పెడితే ఎవరూ పట్టించుకోలేదని, కోర్టు కేసును కొట్టివేసినా మీడియా సంస్థలకు పట్టలేదని అన్నారు. ఇటువంటి సమయంలో ప్రజాశక్తి లాంటి పత్రికల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్ని పేపర్లు చదివినా వాస్తవం తెలియాలంటే ప్రజాశక్తి చదవాలనే అభిప్రాయం అందరిలో ఉందని అన్నారు. అటువంటి ప్రాముఖ్యత మరో దినపత్రికకు లేదని తెలిపారు. ఫెయిర్ కోడ్ సిఇఓ విష్ణు మాట్లాడుతూ ప్రజాశక్తితో కలిసి పనిచేయడం కొత్త అనుభవాలను ఇచ్చిందని పేర్కొన్నారు. అనంతరం వియన్నారావు, ఎంహెచ్ అల్లుడు రంగారావు తదితరులకు శ్రీనివాసరావు, తులసీదాస్ జ్ఞాపికలు అందజేశారు. తొలుత వక్తలను ప్రజాశక్తి సంపాదకవర్గ సభ్యులు కె.జేవియర్ రాజు వేదిక మీదకు ఆహ్వానించారు. వేదికపై ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్ వి.రాంభూపాల్, సిజిఎం వై.అచ్యుతరావు, జనరల్ మేనేజర్ కె.హరికిషోర్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)