- కలెక్టరేట్ ఎదుట ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లాలోని 27 మండలాలను తక్షణమే తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించి, సత్వర సహాయక చర్యలు చేపట్టాలని ఎపి రైతు సంఘం , ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె. వెంకటేషులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి. నారాయణ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఖరీఫ్‌లో 10,87,490 ఎకరాలకు గానూ 8,70,975 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారని, వేసిన పంటలు కూడా ఎండిపోయాయని తెలిపారు. 25 మండలాల్లో 8,66,677 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదికలు పంపినప్పటికీ, పెద్దకడబూరు, కల్లూరు మండలాల్లో కరువు లేదని పేర్కొనడం సరికాదన్నారు. ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని, పశుగ్రాసం, అన్ని మండలాల్లో తాగునీరు అందించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించాలని, పంటల బీమా పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా నాయకులు సూరి , మనోహర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు, కర్నూలు ఓల్డ్ సిటీ సిఐటియు నాయకులు రాజశేఖర్, తాండ్రపాడు మాజీ సర్పంచ్ బాలపీర, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)