ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడకు చెందిన మాదిగ యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా పోలీసులు క్రాంతికుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే తన మరణానికి కృష్ణలంక సిఐ నాగరాజు కారణమని క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నట్లు వస్తున్న సమాచారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఒక యువకుడు పోలీసు వేధింపుల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన విషయం అని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదని, కుల అహంకారం, అధికార దుర్వినియోగం, అణగారిన వర్గాలపై వివక్షకు నిదర్శనంగా భావించాల్సిన ఘటన అని అన్నారు.ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
గాదె సాయికృష్ణ మృతి ఘటనతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పోలీసు వేధింపుల కారణంగా పాండువ అనే యువకుడు మృతి చెందిన ఘటనలపైనా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)