- జివిఎంసి 114వ వార్డులో ప్రజా సంఘాల ఆందోళన
- స్పందించిన ఎంఎల్‌ఎ
ప్రజాశక్తి - పెందుర్తి (విశాఖపట్నం) : జివిఎంసి 114వ వార్డు పరిధి సుజాత నగర్ 80 అడుగుల ప్రధాన రహదారిపై, జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాలను, బార్ అండ్ రెస్టారెంట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కాలనీ సంఘాలు, వార్వా, నివాస్, ఐద్వా సంఘాల ప్రతినిధులు, సిఐటియు నాయకులు, ప్రజలు ఆదివారం భారీ ఆందోళన చేశారు. తొలుత సంపత్ వైన్స్ వద్ద ధర్నా నిర్వహించారు. సుజాతనగర్ జంక్షన్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు బి.రమణి మాట్లాడుతూ సుజాత నగర్ అనేక కాలనీలకు కేంద్రంగా ఉన్న అత్యంత రద్దీ ప్రాంతమని, వేల మంది ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు. విద్యా, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాలు, పార్కులు పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. సంపత్ వైన్స్ బస్ స్టాప్‌కు ఎదురుగా ఉండగా, దాని పక్కనే పాఠశాల, అతి సమీపంలో దేవాలయం, ఆస్పత్రులు ఉన్నాయన్నారు. ఇదే 80 అడుగుల రహదారిపై సంపత్ వైన్స్‌కు సుమారు వంద అడుగుల దూరంలో ఎస్‌విఎల్ఎన్ టవర్స్ పక్కన, ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్‌కు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో మరో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రశాంతమైన జనావాస ప్రాంతంలో మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రజల జీవనానికి, భద్రతకు, సామాజిక వాతావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. సిపిఎం గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి.జగన్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జోన్ కార్యదర్శి బి.వెంకట్రావు ఆందోళనకు మద్దతు తెలిపారు. జనసేన నాయకులు, స్థానిక కార్పొరేటర్లు మోహన్ కుమార్, శేఖర్ నాయుడు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో బి.రమణ, ఫాతిమా, సత్యం, ఎస్.విజయలక్ష్మి, ముత్యాలమ్మ, అప్పలనర్సమ్మ, జె.సత్యనారాయణ, జగన్నాధస్వామి, అప్పలనాయుడు పాల్గొన్నారు.
వైన్స్ మూసివేతకు ఎమ్మెల్యే హామీ
ప్రజల ఆందోళన విషయం తెలిసి స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అక్కడికి వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. ఎక్సైజ్ అధికారులతో మాట్లాడి వారం రోజుల్లో సంపత్ వైన్స్‌ను మూసివేయిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇచ్చిన హామీ అమలు కాకపోతే తాను కూడా ప్రజా సంఘాలతో కలిసి అక్కడే కూర్చుని ధర్నా చేస్తానని ప్రకటించారు.








కామెంట్‌లు (0)