గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్ రద్దు డిమాండ్‌తో విద్యాసంస్థల బంద్‌కు మద్దతుగా విస్తృత ప్రచారం

1 గంట క్రితం

శుక్రవారం (జూలై 24) నిర్వహించనున్న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 08:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* ఒంగోలులో విద్యార్థుల ర్యాలీ –


ఒంగోలు :

నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని, జాతీయ ప్రవేశ పరీక్షల్లో జరుగుతున్న అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం (జూలై 24) నిర్వహించనున్న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతుగా గురువారం సాయంత్రం ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి విద్యాసంస్థలకు బంద్ నోటీసులు అందజేశారు.


ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బండి వీరస్వామి మాట్లాడుతూ... నీట్‌తో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి సి.హెచ్. వినోద్ మాట్లాడుతూ... పరీక్షల అవకతవకలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్యంపై దాడేనని విమర్శించారు. విద్యార్థుల గొంతు నొక్కే చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.


డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె. బాబు మాట్లాడుతూ... పరీక్షల అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత, ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ... విద్యార్థుల న్యాయమైన ఉద్యమానికి తమ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నదని అన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ బంద్‌కు మహిళా సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.


జిల్లావ్యాప్తంగా బంద్ ప్రచారం... :

బంద్ విజయవంతం కోసం ఒంగోలు, కందుకూరు, అద్దంకి ప్రాంతాల్లో ర్యాలీలు, గేట్ మీటింగ్‌లు నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు బంద్ నోటీసులు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.

ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు మోహన్, నవీన్, ఐద్వా నాయకులు ఆదిలక్ష్మి, మాలతి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశాంత్, నితీష్ కుమార్, నీట్ విద్యార్థులు, డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్