- ఎపిపిటిడి (ఆర్‌టిసి) జెఎసి రాష్ట్ర కన్వీనర్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్‌టిసి)లో కండక్టర్ల నియామకాన్ని అవుట్‌సోర్సింగ్, ఆన్‌కాల్ విధానంలో చేపట్టే ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఎపిపిటిడి (ఆర్‌టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలో శాశ్వత స్వభావం కలిగిన పనులకు తాత్కాలిక నియామకాలు చేపట్టడం సరికాదని జెఎసి రాష్ట్ర కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎపిఎస్‌ఆర్‌టిసిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది తదితర కేటగిరీల్లో సుమారు 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. గత 14 ఏళ్లుగా రెగ్యులర్ నియామకాలు జరగకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తోన్న సిబ్బందిపై తీవ్ర పని ఒత్తిడి పెరిగిందని తెలిపారు. ‘స్త్రీశక్తి’ పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య రోజుకు సుమారు 20 లక్షలకు పెరిగిన నేపథ్యంలో బస్సులు, సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిబ్బంది కొరతకు కాంట్రాక్టీకరణ పరిష్కారం కాదని, ఖాళీలన్నింటినీ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడమే శాశ్వత పరిష్కారమని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు భవిష్యత్తులో ప్రవేశపెట్టే బస్సులను ఆర్‌టిసియే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవుట్‌సోర్సింగ్ ద్వారా ఆర్‌టిసిని ప్రయివేటీకరణ వైపు నెట్టే ప్రయత్నాలు కొనసాగితే, రెగ్యులర్ ఉద్యోగ వ్యవస్థ పరిరక్షణకు జెఎసిలోని అన్ని సంఘాలతో త్వరలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.







కామెంట్‌లు (0)