- కార్మిక, కర్షక, ప్రజాసంఘాల పిలుపు
ప్రజాశక్తి-ఒంగోలు: ఎన్నో ఏళ్ల ప్రజా ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న రామాయపట్నం పోర్టును నిర్మాణం పూర్తికాకముందే ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న పోర్టును దీర్ఘకాలిక లీజు పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే ప్రభుత్వ ఆధిపత్యం తగ్గడంతోపాటు స్థానిక ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయని వక్తలు పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బుధవారం కలెక్టరేట్ కార్మిక, కర్షక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా పోర్టు పరిరక్షణకు నిర్వాసిత వర్గాలు, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకుని ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగా ఈ నెల 30న ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రజల ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ప్రభుత్వ పోర్టును కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వల్ల భవిష్యత్తులో స్థానికులకు ఉపాధి, అభివృద్ధి అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నాయకులు పేర్కొన్నారు. పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమయ్యే నిర్వాసితులు, మత్స్యకారులు, కార్మికులు, రైతులు, స్థానిక ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోర్టుపై ప్రభుత్వ ఆధిపత్యం కొనసాగాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, ఐఎఫ్‌టియు నాయకుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిఐటియు, ఎఐటియుసి, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ తదితర ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు.








కామెంట్‌లు (0)