టిడిపి, వైసిపి, జనసేన మౌనంపై బి.వి.రాఘవులు
ఉపాధిహామీ పాత చట్టాన్ని పునరుద్దరించాలి
రాజ్యహింసను ఆమోదిస్తే పౌరహక్కులు ఉండవు
సర్ పేరుతో మోడీ కుట్ర : యు.వాసుకి
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలి
అమెరికా వాణిజ్య ఒప్పందంతో రైతులకు తీవ్ర నష్టం
ప్రజాశక్తి - విజయవాడ : అయోధ్య రామాలయానికి దాతలిచ్చిన నిధులలో జరిగిన అవినీతిపై రాష్ట్రంలో ఉన్న టిడిపి, వైసిపి, జనసేన పార్టీలో నోరెత్తడం లేదని, హిందూ ధర్మం గుర్తించి పదే పదే చెబుతున్న నాయకులు ఇప్పుడు రామమందిర అవినీతిపై బిజెపిని ప్రశ్నించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు యు.వాసుకి, కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవితో కలిసి ఆయన మాట్లాడారు. అయోధ్య రామమందిర విరాళాల అవినీతి విషయంలో ఇప్పటికే ట్రస్టు కార్యదర్శి రాజీనామా చేశారని, మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంలో దిగువస్థాయిలో ఉన్న ఎనిమిది మందిని నిందితులుగా చూపించడం ద్వారా అసలు నిందితులను కాపాడే కుట్ర జరుగుతోందని, సిట్ విచారణ కూడా ఇదే పద్దతిలో ఉందని అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. లేనిపక్షంలో కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా కేంద్రం ఆదేశించాలని డిమాండు చేశారు. ప్రతి చిన్న విషయంపైనా మన్‌కీబాత్‌లో మాట్లాడే మోడీ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేవాలయం విషయంలో ముఖ్యపాత్ర పోషించిన మోడీ దీనికి సమాధానం చెప్పాలని కోరారు. ఎన్‌డిఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా దీనిపై నోరెత్తడం లేదని విమర్శించారు. సనాతన ధర్మం, హిందూదర్మ పరిరక్షణ అంటూ ప్రకటనలు చేసే నాయకులకు ఇప్పుడు అయోధ్య దేవాలయంలో అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహానాడులోనూ ధర్మ పరిరక్షణ అని మాట్లాడిన చంద్రబాబునాయుడు దీనిపై ఎన్‌డిఏలో బిజెపిని నిలదీయాలని అన్నారు. అక్కడ రామాలయం గురించి మాట్లాడితే ఇక్కడ దేవాలయాల్లో జరిగే అవినీతి అంశాలు బయటకు వస్తాయనే భయం ఉందనే అనుమానం కలుగుతోందని అన్నారు. అలాగే వైసిపి కూడా అయోధ్య రామమందిర అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఉపాధిహామీ చట్టంపై ఆందోళనలకు మద్దతు
జిరాంజీ స్థానంలో పాత ఉపాధి హామీ పాత చట్టాన్ని పునరుద్దరించాలని రాఘవులు డిమాండు చేశారు. దీనిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయని, వాటిల్లో రెండు బిజెపి పాలిత రాష్ట్రాలు ఉన్నాయని వివరించారు. కేంద్రం ప్రతిపాదించిన విధంగా 90 : 10 శాతం నిష్పత్తిలో నిధులు ఇస్తే ఈ పథకం అమలు సాధ్యం కాదని తెలిపారు. ఇచ్చే నిధులనూ కేంద్రం పూర్తిగా తగ్గించిందని, దీనివల్ల పనిదినాలు తగ్గిపోతాయని, రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు. 125 రోజుల పనిదినాలు కల్పించలేమని చెప్పారని, ఇలాంటి అంశాలను వ్యతిరేకిస్తూ 13 రాష్ట్రాలు కేంద్రానికి ఉత్తరాలు కూడా రాశాయని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. 60 రోజుల సెలవు దినాలు అంటే ఉపాధిహామీ చట్టంలో కార్మికులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. రాష్ట్రాల హక్కులు నాశనం అవుతుంటే ఎన్‌డిఏలో భాగస్వామ్యంగా ఉన్న టిడిపి కూటమి కూడా దీనిపై నోరు మెదకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. దీనిపై వ్యవసాయ కార్మిక సంఘం జాతీయస్థాయిలో ఆందోళనకు పిలుపునిచ్చిందని, దీనికి సిపిఎం తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనలకూ సిపిఎం తరుపున మద్దతు ప్రకటించడంతోపాటు పార్టీ శ్రేణులు కూడా ఆందోళనలో పాల్గొంటాయని తెలిపారు.
సర్ పేరుతో రాజకీయ కుట్ర : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు యు.వాసుకి
ఓటర్ల ప్రత్యేక సవరణ పేరుతో(సర్) చేపడుతున్న కార్య్రకమం రాజకీయ కుట్ర పూరితమైందని, ఎన్నికల కమిషన్ కూడా బిజెపికి ఏజెంటుగా తయారైందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు యు.వాసుకి అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుగా ఉన్న ఓటును తొలగించడం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేయాలని బిజెపి చూస్తోందని విమర్శించారు. బీహార్లో ఐదు లక్షమందికి ఓటు లేదనే పేరుతో రేషన్‌కార్డులు రద్దు చేశారని అన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో కూడా ఇష్టారాజ్యంగా ఓట్లు తొలగించారని, అక్కడ పార్టీల గెలుపోటముల్లో ఇది కీలకంగా పనిచేసిందని తెలిపారు. ఈవిఎంలను కూడా బిజెపి ప్రభుత్వం తనకు అనుకూలంగా మారుస్తోందని తెలిపారు. ఇన్ని జరుగుతున్నా ఎన్నికల కమిషన్ ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని, తన స్వతంత్రను కోల్పోతోందని విమర్శించారు. ఒకవైపు సర్ పేరుతో ఓట్లను తొలగించడంతోపాటు రెండోవైపు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న ఎంపిలను కొనుగోలు చేస్తోందని వివరించారు. టిఎంసి నుండి 20 మంది, శివసేన బాల్‌థాకరే వర్గం నుండి ఆరుగురు ఎంపిలను కొన్నారని, తరువాత సమాజ్‌వాదీ పార్టీ, డిఎంకెలు టార్గెట్గా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చి హిందూ రాజ్యాంగంగా మార్చే ప్రతయ్నం చేస్తోందని, దీనికి అసవరమైన సంఖ్యా బలాన్ని పార్లమెంటులో బిజెపి తయారు చేసుకుంటోందని అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి
పార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లును యథాతథంగా అమలు చేయాలని, డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని వాసుకీ డిమాండు చేశారు. సిపిఎం తొలి నుండీ ఇదే డిమాండు చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే కోరుతున్నాయని తెలిపారు. లౌకిక పార్టీలు కూడా కలిసి ఐక్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం పోరాడాలని అన్నారు. ఈ బిల్లును అమలు చేయడం ఇష్టం లేకనే బిజెపి వేర్వేరు అంశాలతో ముడిపెడుతోందని విమర్శించారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం తీవ్ర నష్టం
అమెరికాతో వాణిజ్య ఒప్పందం రైతులకు తీవ్ర నష్టం కలిగించే అంశాలు ఉన్నాయని, రైతులు, కూలీలు కూడా నష్టపోతారని అన్నారు. ఇప్పటికే రైతులు కనీస గిట్టుబాటు ధరలు లేక, అప్పుల పాలయ్యే విధంగా అనేక ప్రమాద కర అంశాలను పెట్టారని తెలిపారు. ఒకవైపు ఎన్‌డిఏ ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, అదే సమయంలో రైతులకు పెద్దెఎత్తున సబ్సిడీలు ఇచ్చే అమెరికాతో ఒప్పందం చేసుకుని అక్కడి ఉత్పత్తులను ఇక్కడకు తీసుకొచ్చి అమ్మితే రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.
రాజ్యహింస అత్యంత ప్రమాదకరం
రాజ్య హింస అనేది అత్యంత ప్రమాదకరమని, రౌడీషీటర్లయినంత మాత్రాన కొట్టి చంపాలనేది ఏమీ లేదని, వారికి కోర్టుల ద్వారా చట్టపరిధిలో శిక్షలు వేయాలని బి.వి.రాఘవులు తెలిపారు. విజయవాడలో సాయికృష్ణ హత్య రాజ్యవ్యవస్థ చేసిన అత్యంత దుర్మార్గమైన వ్యవహారమని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. పోలీసుస్టేషŸన్లోనే ఒక వ్యక్తిని కొట్టి చంపడం, శవం కూడా కనబడకుండా మాయం చేయడం అనేది పూర్తిగా రాజ్యహింస కిందకు వస్తుందని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశమని, ప్రశ్నించకపోతే మానవ హక్కులు అనేవి ఉండవని అన్నారు. ఒకసారి రాజ్యహింసను అంగీకరిస్తే పౌర హక్కులు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తుడు అయినంత మాత్రాన ఒక వ్యక్తిని చంపే హక్కు పోలీసులకు రాజ్యాంగం ఇచ్చిందా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో ఏ విషయం జరిగినా దానికి కులాన్ని అంటగట్టడం అనేది రాజకీయ పార్టీలకు ఆనవాయితీగా మారిందని, ఈ పద్ధతి మారాలని తెలిపారు.








కామెంట్‌లు (0)