మొండి వైఖరి వీడని యాజమాన్యం
ప్రజాశక్తి - కడియం (తూర్పు గోదావరి జిల్లా) : తూర్పు గోదావరి జిల్లా కడియం ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికులు 55 రోజులుగా వేతనాల పెంపు కోసం ఐక్యంగా పోరాటాన్ని చేస్తున్నా, యాజమాన్యం మొండి వైఖరివీడక పోవడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి.అరుణ్ తీవ్రంగా ఖండించారు. కడియం యూనిట్ ఎదుట కార్మికుల ఆందోళనా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సిఐటియు తరపున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టి.అరుణ్ మాట్లాడుతూ యాజమాన్యం అత్యంత నిరంకుశంగా కార్మికుల పట్ల వ్యవహరిస్తోందని విమర్శించారు. వేతన ఒప్పందం జరిగి ఆరేళ్లు కావస్తున్నా వేతనాలు పెంచకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. 2020 నుండి ఇప్పటివరకు ధరలు అనేక రెట్లు పెరిగినా, వేతనాలు మాత్రం పెరగలేదని గుర్తు చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను బానిసలుగా చూస్తున్నారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు పెంచాలని ఏప్రిల్ 27 నుండి విధులకు హాజరు కాకుండా ఆందోళన చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక శాఖ వద్ద జాయింట్ మీటింగ్‌లో కూడా యాజమాన్యం నిరంకుశ వైఖరి కొనసాగిందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో యాజమాన్యానికి రూ.వందల కోట్ల నికర లాభాలు వస్తున్నప్పటికీ, జీతాలు పెంచలేదని, పైగా ప్రశ్నించిన 59 మంది కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించారని, సమస్యలు పరిష్కరించాలని 11మంది పర్మినెంట్ కార్మికులను యాజమాన్యం ఏకపక్షంగా సస్పెండ్ చేసి వేధింపులకు గురి చేస్తోందన్నారు. యాజమాన్యం పెట్టిన అక్రమ లాకౌట్ కాలానికి పర్మినెంట్ కార్మికులకు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు అందరూ ఐక్యంగా పోరాటాన్ని కొన సాగించాలని, సిఐటియు కార్మికుల పక్షాన నిలబడి ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్ భరోసానిచ్చారు.
యాజమాన్యం ఇదే తీరిన మొండిగా వ్యవహరిస్తే జిల్లావ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు బి.పూర్ణిమ రాజు, మిల్లు పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)