ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

21 నుంచి మండల కార్యాలయాల వద్ద ఆందోళనలు

11 సెప్టెంబర్, 2026

ruthu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 11:33 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- జయప్రదం చేయాలని రైతు, కౌలు రైతు, వృత్తిదారుల, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నెలకొన్న కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరినికి నిరసనగా ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు మండల కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ ‌రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య తెలిపారు. విజయవాడలోని ఎంబివికెలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబులతో కలిసి శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. , ప్రభుత్వం వెంటనే కరువుపై స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాలని, కరువు ప్రాంతాలను నోటిఫై చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం కరువు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో 55 శాతం భూముల్లో కరువు కారణంగా విత్తనాలు వేయలేదన్నారు. కొన్ని చోట్ల పశువులకు తాగునీరు, మేత కరువయ్యిందన్నారు. కరువు కారణంగా చాలా గ్రామాల్లో ప్రజలు చేసేందుకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నెల 21 నుంచి రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తిదారుల సంఘాల రాష్ట్ర నాయకుల బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కరువు పరిస్థితులను పరిశీలించనుందని తెలిపారు. ఏఏ జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉంది, నీటి ఎద్దడి ఎక్కడెక్కడుంది, రుణాల రీ షెడ్యూల్‌ ‌చేయాల్సిన పరిస్థితి ఎక్కడుంది అనే అంశాలను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులు, కూలీలు, కౌలుదారులు అందరూ ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతులు, కౌలుదారులు, కూలీల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్నామ్నాయ ప్రణాళిక ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఉపాధి హామీ స్థానంలో కొత్త చట్టం తీసుకువచ్చిన అనంతరం కూలీలకు పనులు దొరకడం లేదన్నారు. అక్కడక్కడా పని దొరికినా రోజుకు రూ.30 కూలీ కూడా రాని పరిస్థితి నెలకొందన్నారు. అన్ని గ్రామాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ 125 రోజులు ఉపాధి కల్పించాలని, కరువు పరిస్థితిలో అదనంగా పని కల్పించాలన్నారు. పశువులు, జీవాల పెంపకందారులు పశువులకు మేత లేకపోవడంతో ఆందోళనకు గురువుతున్నారని చెప్పారు. అనేక ప్రాంతంలో రైతులు పంటలను వేశారు. సాగునీరందక, వర్షాలు లేక పంట నష్టపోయారన్నారు. రెండెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించేదన్నారు. ఇప్పడు ఆ పరిస్థితి లేదని, రైతులపైనే ఆ భారం వేశారని తెలిపారు. నిన్నటి వరకూ రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడి పంటలు అమ్ముకున్నారని, ఇప్పుడు మార్కెట్‌‌లో నిత్యావసర వస్తువల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం ఉపాధి చూపించడంతోపాటు, పశువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, రేషన్‌ ‌దుకాణాల్లో నిత్యావసర వస్తువులు సబ్బిడీపై అందజేయాలని కోరారు. రైతులు రుణమాఫీ చేయాలని గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రమంతటా ఒకే రకమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక కాకుండా ఎక్కడికక్కడ పరిస్థితులను భట్టీ ప్రాంతీయంగా ప్రణాళికలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీజన్‌ ‌ప్రారంభానికి ముందు సిఎం మాట్లాడుతూ.. ఈ ఏడాది చాలా ముందుగా నీళ్లిస్తాం, తుఫానులు బారిన పడకుండా ఉండేందుకు రైతులు ముందస్తుగానే పంటలు సాగు చేయాలని రైతులందరూ ముందుగానే పంటల సాగుకు ప్రోత్సహించారని, పంటలు వేసిన అనంరతం నీరివ్వడంలో వైఫల్యం చెందారని తెలిపారు. ఎల్‌‌నినో హెచ్చరికలు ముందుస్తుగా ఉన్నప్పటికి ముఖ్యమంత్రి నమ్మబలికి రైతులతో పంటలను వేయించారన్నారు. ఈ నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కౌలు రైతులు ముందుగానే కౌలు చెల్లించడం, పంటలకు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారని, వీరికి కౌలును వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. రుణాలు మాఫి చేయడంతోపాటు, ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయడం, ఏఏ ప్రాంతాల్లో ఏ పంటలు సాగు చేయాలో స్పష్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు వెంకట్రావు, రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు, రైతు సంఘం కోశాధికారి ఎం. సూర్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్