మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాశ్వత హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలి

11 సెప్టెంబర్, 2026

sapsa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రజాసంఘాలు బైక్ ర్యాలీ.. కలెక్టరేట్ వద్ద నిరసన

ప్రజాశక్తి -కర్నూలు కలెక్టరేట్ : కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్‌ వరకు శుక్రవారం ప్రజాసంఘాల నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఐలు రాష్ట్ర అధ్యక్షులు కె కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకట్ స్వామి, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వర రెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మి దేవి, వై జయరాజు, మురళీ మోహన్, ప్రకాష్ రెడ్డి ధర్నానుద్దేశించి మాట్లాడారు. శాశ్వత హైకోర్టు బెంచ్‌‌ను ఏర్పాటు చేయాలని జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు కేవలం న్యాయవాదులకే కాక, ఈ ప్రాంత సామాన్య ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని వివరించారు. కర్నూలులో 90 రోజుల్లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పటికే 41 రోజులు పూర్తయినా పనుల్లో పురోగతిలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీకి కట్టుబడి పనులను వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. శాశ్వత బెంచ్ సాధించే వరకు తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌ పరిపాలనాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఐలు, పట్టణ పౌర సంక్షేమ సంఘం, జిల్లా మేధావుల ఫోరం, రాయలసీమ విద్యావంతుల వేదిక, రైతు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్