మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాల ధర పెంపుపై ప్రజాగ్రహం

16 సెప్టెంబర్, 2026

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 06:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

@ధరలు తగ్గించాలని సిపిఎం డిమాండ్‌

ప్రజాశక్తి - విజయవాడ : పెంచిన పాల ధరలను తక్షణమే తగ్గించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తెచ్చి రేషన్ డిపోల ద్వారా సరసమైన ధరలకే అన్ని రకాల సరుకులు అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంక, భ్రమరాంబపురంలో మంగళవారం ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ బియ్యం మొదలుకొని అన్ని నిత్యావసరాల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోని ముఖ్యమంత్రి, టిడిపి కార్యకర్తల ఆదాయం పెంపు గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ధరల నియంత్రణపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గర్హనీయమన్నారు. విజయ డెయిరీ (కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్) చైర్మన్‌‌తో ప్రభుత్వ పెద్దలు బలవంతంగా రాజీనామా చేయించారని, ప్రస్తుతం చైర్మన్ లేకపోయినా పండగ రోజు నుంచి లీటరుకు రూ.రెండు చొప్పున పాల ధర పెంచడం అమానుషమని అన్నారు. ఇది హెరిటేజ్ సహా ఇతర ప్రైవేటు డెయిరీలు కూడా ధరలు పెంచుకునేందుకు దారి చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లలు, గర్భిణులకు ప్రధాన పౌష్టికాహారమైన పాలపై ఏప్రిల్‌లోనే ధరలు పెంచారని, ఐదు నెలలు తిరగక ముందే మళ్లీ అడ్డగోలుగా ధరలు పెంచడం సరికాదన్నారు. చైర్మన్ కూడా లేని మిల్క్ యూనియన్‌లో ఈ నిర్ణయం ఎవరు, ఎందుకు తీసుకున్నారో ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ధరల పెంపుపై నోరు మెదపడం లేదని, ధరలు పెంచిన పాలకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు కమిటీ నేతలు పి.కృష్ణ, బి.చిన్నారావు, వి.గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్