శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాశక్తి విలేకరిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారి దురుసు వ్యాఖ్యలు

1 గంట క్రితం

ప్రజాశక్తి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అధికారి వైఖరిని ఖండించిన ప్రెస్ క్లబ్, ఆదివాసీ గిరిజన సంఘం

ప్రజాశక్తి - కురుపాం : మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ ప్రజాశక్తి వెబ్‌లో వార్త రాసిన విలేకరి జి. డిల్లీశ్వరరావుపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ కె.నాగేశ్వరరావు దురుసుగా మాట్లాడారు. అధికారి వైఖరిని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోరంగి సీతారాం, కురుపాం ప్రెస్ క్లబ్ తరఫున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత అని, వాస్తవాలను రాసిన విలేకరిపై దురుసుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని వారు అధికారిని గట్టిగా నిలదీశారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత, గతంలో ఇద్దరు విద్యార్థుల మృతి, వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలైన ఘటనలు, ప్రస్తుతం 65 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్లతో చికిత్స పొందుతున్న పరిస్థితులను ప్రజాశక్తి వెబ్ కథనంలో ప్రస్తావించిన నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకుంది. విద్యార్థుల ఆరోగ్య భద్రత, గురుకులంలో నెలకొన్న పరిస్థితులపై వార్త రాయడం ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశమని వారు పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై వార్తలు రాసే విలేకరులను అధికారులు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు విలేకరులపై దురుసుగా మాట్లాడటం, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా గొంతును అణచివేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. వార్తలో తప్పులుంటే ఆధారాలతో వివరణ ఇవ్వాలి తప్ప, విలేకరులపై దురుసు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

ప్రజాశక్తి విలేకరి జి. డిల్లీశ్వరరావుపై ఆర్డబ్ల్యూఎస్ డీఈ కె. నాగేశ్వరరావు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు సంయమనం పాటించాలని కోరంగి సీతారాం, కురుపాం ప్రెస్ క్లబ్ తరఫున మీడియా మిత్రులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై మీడియా తన బాధ్యతను నిర్భయంగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్