- వంటా వార్పు భగ్నం
- వందలాదిమంది అరెస్ట్
- స్టీల్ ప్లాంట్‌లో శాశ్వత ఉద్యోగాలైనా కల్పించాలని, భూములైనా తిరిగి ఇవ్వాలని ఆందోళనకారుల డిమాండ్
ప్రజాశక్తి - ఉక్కునగరం, గాజువాక (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు నిర్వాసితులపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖ ఉక్కు కర్మాగారం భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యాన శనివారం ఉదయం నుంచి 48 గంటలపాటు వంటావార్పు నిరసన కార్యక్రమానికి నిర్వాసితులు పూనుకున్నారు. ఉక్కునగరంలోని కొవ్వొత్తుల (క్యాండిల్) జంక్షన్‌ను తమ ఆందోళనకు వేదికగా చేసుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ భారీగా పోలీసు బలగాలను మోహరించి, నిరసనకారులను ఎక్కడికక్కడే ప్రభుత్వం అడ్డుకుంది. శనివారం తెల్లవారుజాముకే ఉక్కు నిర్వాసిత ప్రాంతాలైన పెదగంట్యాడ, బిసి రోడ్డు, వై.జంక్షన్, అగనంపూడి, వడ్లపూడి, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. స్టీల్ ప్లాంట్‌కు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లో తనిఖీలు నిర్వహించి ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. వంటా వార్పు నిరసనకు వస్తున్న నిర్వాసితుల్లో వందలాది మందిని అరెస్టు చేసి స్టీల్‌ప్లాంట్, పెందుర్తి, గోపాలపట్నం తదితర పోలీస్ స్టేషన్లకు వ్యాన్లలో తరలించారు. అరెస్టయిన వారిలో నిర్వాసితుల సంఘం, సిఐటియు నాయకులు నమ్మి రమణ, యు.సోమేష్, కె.మహేష్, పితాని భాస్కరరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్బంగా నిర్వాసిత సంఘం నాయకులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చి నాలుగు దశాబ్దాలు గడిచినా సుమారు 8,500 మంది నిర్వాసిత కుటుంబాలకు ఇప్పటికీ శాశ్వత ఉద్యోగాలు కల్పించలేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న నిర్వాసితులను కూడా తొలగించిందని విమర్శించారు. తమకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, లేదంటే భూములైనా తిరిగి ఇవ్వాలని వంటా వార్పు కార్యక్రమాన్ని తలపెట్టామని అన్నారు.
ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
వంటా వార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో నిర్వాసితులు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకూ మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కార్యాలయం లోపలకు నిర్వాసితులు దూసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కొంతమందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారందరినీ సాయంత్రానికి విడిచిపెట్టారు.
నిర్బంధం అమానుషం : సిపిఎం, సిఐటియు
విశాఖ ఉక్కు నిర్వాసితులపై ప్రభుత్వ నిర్బంధం అమానుషమని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిర్బంధకాండను ఖండించారు. విశాఖ ఉక్కు నిర్మాణం కోసం 64 గ్రామాల ప్రజలు 16,500 మంది నిర్వాసితులు వేలాది ఎకరాల భూములను త్యాగం చేశారన్నారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం నిర్వాసితులందరికీ విశాఖ ఉక్కులో పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అమలు కాలేదన్నారు. తరాలు మారుతున్నా ఉద్యోగ కల్పన హామీగానే మిగిలిందన్నారు.








కామెంట్‌లు (0)