బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బీసెంట్‌ ‌రోడ్‌‌లో టెన్షన్‌

1 రోజు క్రితం

becent road
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- విజయవాడలో హాకర్లపై సర్కారు దాడి

- తొలగించేందుకు యత్నం

- సిఐటియు నేతృత్వంలో భారీ నిరసన

- సిపిఎం, సిపిఐలతో పాటు పలు కార్మిక, ప్రజా సంఘాల మద్దతు

విజయవాడ బీసెంట్‌ ‌రోడ్‌ అంటేనే చిరు వ్యాపారులు! సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు నాణ్యమైన సరుకులు అందించడం వీరి ప్రత్యేకత! నిత్యావసరాల నుండి ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్‌, మొబైల్స్‌ ఇలా వీరి దగ్గర దొరకని వస్తువుండదు! తోపుడు బండ్లమీద, రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న చిన్న చిన్న షాపుల్లోనూ వీటిని విక్రయిస్తూ పొట్ట పొసుకుంటూ ఉంటారు. బీసెంట్‌ ‌రోడ్డులో పెద్ద షాపులు ఎన్ని ఉన్నప్పటికీ వీరి ప్రత్యేకత వీరిదే! వీరి కారణంగానే ఆ రోడ్డు వారంలో అన్ని రోజులు సాధారణ ప్రజలతో కిటకిటలాడుతుంటుంది! విజయవాడకు మరోపేరుగా బీసెంట్‌‌రోడ్డును మార్చిన ఈ చిన్న వ్యాపారులపై ప్రభుత్వం విరుచుకుపడింది. మంగళవారం ఉదయం పోలీస్‌‌ పహారాలో చిరువ్యాపారులను అక్కడి నుండి తొలగించే చర్యకు ప్రభుత్వం దిగింది. అనూహ్యంగా పోలీసులు, అధికారులు వారిపై విరుచుకుపడ్డారు. అయితే, ఈ ప్రయత్నాలను చిరువ్యాపారులు అడ్డుకున్నారు. సిఐటియు నేతృత్వంలో అప్పటికప్పుడు ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలు చేశారు. వీరికి సిపిఎం, సిపిఐతో పాటు పలు కార్మిక ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

ప్రజాశక్తి - ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా ప్రతినిధి : విజయవాడ బీసెంట్‌ ‌రోడ్డులో హాకర్ల తొలగింపునకు అధికారులు పూనుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మంగళవారం ఉదయం తోపుడు బండ్లను తొలగించేందుకు వచ్చిన అధికారులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అధికారుల ప్రయత్నాలను చిరువ్యాపారులతో కలిసి సిఐటియు నేతలు అడ్డుకున్నారు. తొలగింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత గుర్తింపు కార్డులు, డబ్బులు కట్టిన రసీదులు పరిగణనలోకి తీసుకొని తొలగించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ముందుగా పదుల సంఖ్యలో బీసెంట్ రోడ్డులో పోలీసులను మొహరించి అక్రమంగా హాకర్ల తోపుడు బండ్లను తొలగించేందుకు అధికారులు వచ్చారు. వీరి తీరుకు నిరసనగా విజయవాడ హాకర్స్ అండ్‌ తోపుడుబండ్లు యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన చిరు వ్యాపారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

చిరు వ్యాపారులకు సిఐటియు, పలు ప్రజా సంఘాల మద్దతుగా నిలిచారు. దీంతో బీసెంట్ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హాకర్లకు చట్టబద్ధంగా జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నప్పటికీ వారిని బలవంతంగా తొలగించడం సరైన విధానం కాదని సిఐటియు నాయకులు... మున్సిపల్ యుసిడి, టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీశారు. స్ట్రీట్ వెండర్స్ చట్టానికి విరుద్ధంగా హాకర్ల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్క్ నుండి తుమ్మిడి బ్రదర్స్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. చిరువ్యాపారుల ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, సిఐటియు ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్‌ ‌తదితరులు మద్దతుగా నిలిచారు. హాకర్ల జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు. హాకర్ల హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. గుర్తింపు కార్డులు కలిగిన హాకర్లను వేధించడం, వారి ఉపాధిని హరించే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హాకర్లతో మున్సిపల్ కమిషనర్ చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో హాకర్లతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వీధి విక్రయదారుల (జీవనోపాధి రక్షణ, వీధి విక్రయాల నియంత్రణ) చట్టం–2014 ప్రకారం హాకర్లకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణ, సిఐటియు నగర కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు, వై.సుబ్బారావు, ఎం.వి.రమణ, ఎం.బాబురావు, జి.గోవింద్, విజయవాడ హాకర్స్ అండ్‌ తోపుడుబండ్లు యూనియన్ (సిఐటియు) నగర కార్యదర్శి సిహెచ్.మురళి, అధ్యక్షులు భూలోకం, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు తో పాటు పలు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు పలికారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్