మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅది ’స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రిమూవల్‌’

7 గంటల క్రితం

అది ’స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రిమూవల్‌’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 09:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌ ‌కుమార్‌‌ను తొలగించాల్సిందే

  • 2న రాష్ర్ట వ్యాప్త నిరసనలు : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : ‘ఎస్‌ఐఆర్’ అంటే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ ‌రివిజన్‌ కాదు... స్పెషల్‌ ఇంటెన్నివ్‌ ‌రిమూవల్‌గా ఎన్నికల సంఘం మార్చింది’ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. అక్రమాలకు పాల్పడిన ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్‌ కుమార్‌‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. ‘ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర కుమార్‌‌ను పదవి నుంచి తొలగించాలి’ అని డిమాండ్ చేస్తూ అనంతపురం నగరంలోని గణేనాయక్‌ ‌భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సదస్సు జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.రామిరెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి ‘ఎస్‌ఐఆర్‌’ అర్థాన్నే మార్చే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్‌ఐఆర్‌ పేరుతో దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగిం‌చారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు లేకుండా చేయడమంటే ప్రజలకు ఓటు హక్కు లేకుండా చేయడమేనని పేర్కొన్నారు. బిజెపికి అనుకూలంగా ఎన్నికల ఫలితాల కోసమే ఇది జరిగిందని, జ్ఞానేష్‌ కుమార్‌ ఒక పెద్ద అవినీతిపరుడని, గతంలో కేరళలో పనిచేసిన సమయంలో ఆయనపై అనేక ఆరోపణలొచ్చాయని వివరించారు. మరో ఐఎఎస్‌ అధికారిని బిజెపిలో చేరాలంటూ, మంత్రి పదవి కూడా ఇప్పిస్తానంటూ బిజెపి తరఫున వాకాల్తా పుచ్చుకున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారిగా కాకుండా బిజెపి ఏజెంటుగా పనిచేశారని వివరించారు. తక్షణం ఆయనను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌‌తో అక్టోబరు రెండున రాష్ర్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చినట్టు శ్రీనివాసరావు తెలిపారు. దీనికి వైసిపి కూడా కలసి వస్తోందన్నారు. రాష్ర్టంలో అధికారంలో ఉన్న టిడిపికి ఎన్నికల సంఘం తప్పిదాలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. అంతా పారదర్శకంగా ఉన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రాష్ర్టంలో ఎస్‌ఐఆర్‌‌లో 44 లక్షల ఓట్లు ఎందుకు పెండింగ్‌‌లో ఉన్నాయో టిడిపి కూటమి నేతలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. 2.50 లక్షల కొత్త ఓట్లు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. వీటికి ‌ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. అసలు సమస్యను గుర్తించకుండా బిజెపికి టిడిపి మద్దతు ఇస్తే భవిష్యత్తులో ఆ పార్టీకే తీరని నష్టం వాటిల్లక తప్పదని హెచ్చరించారు. జ్ఞానేష్‌ కుమార్‌‌ను పదవి నుంచి తొలగించే వరకు జరిగే పోరాటంలో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌గేయానంద్‌‌ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఒక ప్రణాళిక ప్రకారమే ఎన్నికల సంఘంలో మార్పులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆ మార్పు తర్వాతే ఎన్నికల ప్రధాన అధికారిగా జ్ఞానేష్‌ కుమార్‌‌ నియమితులయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన ఎటువంటి తప్పులు చేసినా తర్వాత కూడా చర్యలు తీసుకునేందుకు వీల్లేకుండా మరో చట్టసవరణ చేసిందని, ఇది ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని తెలిపారు. ఈ అంశాలపై ప్రతి ఒక్కరూ కదిలొచ్చి పోరాడాల్సిన అవసరముందని తెలిపారు. సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, శ్రీనివాసులు, నాగేంద్రకుమార్‌, చంద్రశేఖర్‌‌రెడ్డి, సిపిఐ ఎంఎల్‌ ‌న్యూడెమోక్రసి నాయకులు ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్