ప్రజాశక్తి - యంత్రాంగం : సమస్యలపై విద్యార్థి లోకం గర్జించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు విడనాడాలని, హాస్టళ్లు, రవాణా తదితర సమస్యలు పరిష్కరించాలని ఎలుగెత్తి నినదించింది. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా కలెక్టరేట్లను విద్యార్థి లోకం చుట్టుముట్టింది. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేందుకు లోపలికి అనుమతించకపోవడంతో కర్నూలు, తిరుపతి, భీమవరం, మచిలీపట్నంలో ఆగ్రహించారు. తోపులాటలు, ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు అనుమతించడంతో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
కర్నూలులో కలెక్టరేట్‌ను విద్యార్థులు ముట్టడించారు. శాంతియుతంగా చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ గేట్లను ఎక్కి ఎస్ఎఫ్ఐ నాయకులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పది మంది విద్యార్ధి నాయకులకు కలెక్టర్ వద్దకు పోలీసులు తీసుకువెళ్లారు. విద్యారంగ సమస్యలపై కలెక్టర్ ఎ. సిరికి వినతపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి అర్చ్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన, మోకాళ్లపై కూర్చొని ఖాళీ ప్లేట్లతో విద్యార్థులు నిరసన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. స్థానిక తిరుమల విద్యాసంస్థల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లనీకుండా పోలీసులు విద్యార్థులను నిలువరించారు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ నేతలు, విద్యార్థులు కలెక్టరేట్ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొనేంతవరకు ఇక్కడి నుంచి వెనుదిరిగేది లేదని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.... డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతున్నాయని, ఈ పరీక్షకు హాల్ టికెట్లు పొందడానికి, ఇప్పటికే విద్యను పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొనేందుకు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము చెల్లిస్తేనే ఇస్తామని యజమాన్యాలు చెబుతున్నాయన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ కళాశాలల్లోనే కాకుండా చివరకు ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
తిరుపతి కలెక్టరేట్ ప్రధాన మార్గంలో రోడ్డుపై కూర్చున్నారు. కలెక్టరేట్ లోపలికి ప్రవేశించడానికి విద్యార్థి సంఘాల నాయకులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి నాయకుల పట్ల తిరుపతి ఎఎస్ఐ దురుసుగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆ తరువాత విద్యార్థి నాయకులను కలెక్టర్ ను కలిసేందుకు తీసుకువెళ్లారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరగా, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం కొందరు నాయకులు, విద్యార్థులను మాత్రమే కలెక్టరేట్‌లోకి అనుమతించారు. డి ఆర్ఒ పోతురాజుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గుంటూరు, పల్నాడు, అనకాపల్లి, కాకినాడ,తూర్పుగోదావరి, నెల్లూరు, కడప కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద విద్యార్థులు బైఠాయించి నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మామిళ్లకుంట క్రాస్ నుంచి రెవెన్యూ భవన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడే ధర్నా చేశారు. పార్వతీపురంలోని వేదశ్రీ ఒకేషనల్ జూనియర్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. ఎన్ టిఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.








కామెంట్‌లు (0)