మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హక్కులు, చట్టాల పరిరక్షణకు ఆదివాసీల మహాగర్జన

12 గంటల క్రితం

girijana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- రంపచోడవరంలో భారీ ర్యాలీ, సభ

- కార్యక్రమ భగ్నానికి ప్రభుత్వం కుట్ర

- ప్రతిఘటించి కదిలొచ్చిన గిరిజనం

ప్రజాశక్తి- రాజవొమ్మంగి (పోలవరం జిల్లా) : గిరిజనుల హక్కులను, 1/70 చట్టాన్ని పరిరక్షించాలని, జిఒ నెంబర్‌ 3‌ని పునరుద్ధరించాలని లేదా ఎన్నికల హామీ మేరకు అందుకు ప్రత్యామ్నాయ జిఒను తేవాలని, ప్రత్యేక డిఎస్‌‌సి నిర్వహించాలని డిమాండ్‌ ‌చేస్తూ పోలవరం జిల్లా రంపచోడవరంలో ఆదివాసీలు సోమవారం పెద్ద ఎత్తున కదం తొక్కారు. తమ హక్కులపై గర్జించారు. ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఆదివాసీలు పోటెత్తారు. ‘ఆదివాసీ మహా గర్జన’ పేరిట తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని నిలువరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కుట్రలు చేసింది. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను ఆపివేశారు. గిరిజనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నిర్బంధాన్ని ప్రతిఘటించి ఆదివాసీలు మహా గర్జనకు తరలివచ్చారు. మహిళలు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో కదిలొచ్చి రంపచోడవరం పిఎంఆర్‌‌సి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ కూడలి మీదుగా స్టేట్ బ్యాంక్ సమీప ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం, ఆదివాసీ సంఘాల నాయకులు కంగల శ్రీనివాస్‌, బొప్పెన కిరణ్‌, కత్తుల ఆదిరెడ్డి, కుంజా అనిల్, వెదుళ్ల లచ్చిరెడ్డి, ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, పల్లాల లింగారెడ్డి, పులి సంతోష్ కుమార్‌, మడివి రవితేజ, పండ సిద్ధార్థ, తెల్లం శేఖర్, బోండ్ల వరప్రసాద్, బుసరి బాలరాజు, తీగల బాబూరావు, మట్ల వాణిశ్రీ, టి.శ్రీను, వంతు బాలకృష్ణ మాట్లాడారు. జిఒ నెంబర్ 3 రద్దుతో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో అరకులో జరిగిన సభలో చంద్రబాబు జిఒ నెంబర్‌ 3కి ప్రత్యామ్నాయంగా మరో జిఒ తెస్తామని హామీ ఇచ్చినా అది నేటికీ అమలు కాలేదని గుర్తు చేశారు. దీంతో, ఆదివాసీలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రత్యేక డిఎస్‌‌సి నిర్వహించి ఏజెన్సీలో వంద శాతం ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

సుప్రీం కోర్టులో నాన్ ట్రైబల్స్ అప్పీళ్లపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని కోరారు. లేనిపక్షంలో గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూ హక్కులు, పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంతోపాటు అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులందరికీ వెంటనే భూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఎం చంద్రబాబు ఈ నెల 24న రంపచోడ వరం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పైఅంశాలపై స్పష్ట మైన ప్రకటన చేయాలని కోరారు. గిరిజన ప్రాంతా ల్లోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనులు తమ హక్కుల పరిరక్షణకు పోరాడుతుంటే వారిని నిర్బంధించడం, అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఐదో షెడ్యూల్ ఏరియాలో ఏమి చేయాలన్నా గవర్నర్ అనుమతి ఉండాలని, పీసా గ్రామ కమిటీల తీర్మానాల ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉందని గుర్తుచేశారు. ఏజెన్సీ అభివృద్ధికి ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆ దిశగా పనిచేయకపోవడం విచాకరమన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలు, సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ఏజెన్సీ వ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ ఉద్యమానికి ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఆదివాసీ ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

చింతూరు ఐటిడిఎ ఎదుట బైఠాయించిన ఆదివాసీలు

రంపచోడవరంలో తలపెట్టిన మహా గర్జన ర్యాలీ, సభకు చింతూరు డివిజన్ నుండి వాహనాల్లో తరలివస్తున్న వారిపై పోలీసులు నిర్బంధం ప్రయోగించారు. సభకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో, ఆదివాసీలు చింతూరు ఐటిడిఎ కార్యాలయం ముందు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌‌పి బొడ్డు హేమంత్ కుమార్, ఐటిడిఎ పిఒ శుభం నొక్వాల్... ఆదివాసీ సంఘం నాయకులతో చర్చలు జరిపి మహా గర్జన సభకు వెళ్లేందుకు అనుమతిచ్చారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్