గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో "వాక్ ఫర్ రైట్ టు వోట్ "

2 గంటల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 06:20 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

విజయవాడ : ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు, పోలింగ్ బూత్‌ల ఆక్రమణ, నిమినేషన్ పత్రాల చించివేత, నామినేషన్లు, ఎజెంట్లను అనుమతించsకపోవడం వంటి ఘటనలు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరిగాయి. పోలీసులు, పోలింగ్ అధికారులు సైతం అధికార కూటమికి కొమ్ముకాశారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్షాలపైనే గాక తెలుగుదేశం పార్టీలో అంతర్గత ముఠాల మధ్య, కూటమి పార్టీలపైనా కూడా ఇవి వ్యాపించాయి. ఈ ఘటనలన్నింటిపైనా న్యాయ విచారణ జరిపించాలి. భవిష్యత్తులో ఓటు వేసే హక్కును కాపాడాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వాక్‌ఫర్ ఓట్‌టు రైట్ కోసం జరిగిన ర్యాలీలో డిమాండ్ చేశారు.

రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకునేందుకు ప్రతిజ్ఞ పూనాలన్నారు. సర్ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓట్లను తొలగించడం అప్రజాస్వామికమన్నారు. సర్ పేరుతో ప్రజలను విభజించి, ఓటు లేని వారిని రెండవ తరగతి పౌరులుగా చేసే విచ్చిన్న రాజకీయాలు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల అధికారి గా ఉన్న జ్ఞానేశ కుమార్ బీజేపీ నమ్మిన బంటుగా ఉంటూ దేశ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టిన వ్యక్తి ఇంకా పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సుప్రీం కోర్ట్ ఆగ్రహాన్ని సైతం లెక్కచేయకుండా బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలి : వి.శ్రీనివాసరావు

స్థానిక సంస్ధల ఎన్నికల అక్రమాలపై న్యాయ విచారణ చేయాలని, దేశంలో ప్రతీ ఒక్క పౌరుని ఓటు పరిరక్షించబడాలని, బిజెపి నమ్మినబంటు సిఇసి జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, రాష్ట్రంలో జరుగుతున్న ఓటు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వాక్ ఫర్ వోట్ టు రైట్ ర్యాలీలో వక్తలు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం ఓటు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి అంబెడ్కర్ స్మృతివనం వరకు నిర్వహించారు.

ప్రతి ఒక్క పౌరుని ఓటు హక్కు పరిరక్షించబడాలి : సుంకర రాజేంద్రప్రసాద్

ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కుల్ని కాపాడుకోవడం పౌరులందరి బాధ్యత అన్నారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే వారి చేతిలోనే దేశ ప్రగతి ఉందనే అంబేడ్కర్ మాటలను అయన గుర్తుచేశారు. కానీ ఈనాడు ఆ రాజ్యాంగాన్ని నమ్మనివారు, మన దేశానికీ పనికిరాదు అని చెప్పినవారు అధికారంలో ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అనేది వెన్నెముక అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వెన్నెముకను విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూనుకున్నాయని ఆయన అన్నారు. ఓటుహక్కు లేకపోతే ఈ దేశ పౌరులు కాదు అనే చెప్పే స్థితికి రావడం భారత ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించేదిగా మారిందన్నారు.

బిజెపి నమ్మిన బంటు సిఇసి జ్ఞానేష్ కుమార్ పదవికి అనర్హుడు, రాజీనామా చేయాలి : జి.ఈశ్వరయ్య

అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతుందని పత్రికల్లో కధనాలు వస్తున్నా దున్నపోతుపై వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ పై అనేక ఆరోపణలున్నాయని, తనతోటి ఎన్నికల అధికారులను లెక్కచేయకుండా బీజేపీ అధికారంలో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కేంద్రం అండ చూసుకునే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవాల పేరుతో హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చివరకు ప్రజలే భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకునే స్థితికి దిగజార్చారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ, విద్యార్థులకు నీతిమాటలు చెప్తూ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తున్నారన్నారు. మొత్తం అధికార యంత్రాంగం, పోలీసులు కుమ్మక్కై రాష్ట్ర ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టించారన్నారు. ఎన్నికల అవకతవకలపై స్వతంత్ర న్యాయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి విజయవాడ కార్పొరేటర్ బోయ సత్యబాబు అధ్యక్షత వహించగా సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, వై.వెంకటేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డి, కె.సుబ్బరావమ్మ, టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.సాంబిరెడ్డి, నగర ప్రముఖులు చుక్కపల్లి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్