- 12వ పిఆర్సి, కనీస వేతనాల కోసం ఆందోళన
- సిఐటియు ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ఎదుట నిరసనలు
ప్రజాశక్తి - యంత్రాంగం : కనీస వేతనం,12వ పిఆర్సి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాలు చేపట్టాలని మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, విధుల్లో ఉండగా మృతి చెందిన కార్మిక కుటుంబాల సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకూ పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
కడపలో నిర్వహించిన నిరసన ర్యాలీలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నగర పాలక సంస్థల్లో పనిచేస్తూ మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో నాలుగేళ్లలో 18 మంది కార్మికులు చనిపోతే, వారి కుటుంబాలకు ఇప్పటి వరకూ కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కేటాయించకపోవడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికుల పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి 'చలో ఢిల్లీ' కార్యక్రమానికి సిఐటియు పిలుపునిచ్చిందని, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
విశాఖ సూర్య బాగ్లోని జోన్ -4 కార్యాలయం వద్ద, మధురవాడ జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు విశాఖ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్కెఎస్వి.కుమార్ మాట్లాడుతూ.. డెత్, సిక్, రిటైర్మెంట్ స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు కల్పించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పోస్టులను అమ్ముకుంటున్నారని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కార్యాలయాల ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. అనంతపురం నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి సప్తగిరి సర్కిల్, సుభాష్ రోడ్డు మీదుగా టవర్ క్లాక్ వరకూ నిరసన ప్రదర్శన కొనసాగించారు. ర్యాలీలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణ పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరం ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
పార్వతీపురం మన్యం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నంద్యాలలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఏడు రోడ్లు కూడలి వరకూ ప్రదర్శన, పలాస-కాశీబుగ్గ గాంధీ విగ్రహం నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలి, గూడూరు, ఒంగోలు అద్దంకి బస్టాండ్ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు.








కామెంట్లు (0)