ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయవాడలో న్యాయవాదుల దీక్షలు

30 సెప్టెంబర్, 2026

విజయవాడలో న్యాయవాదుల దీక్షలు
- విధులు బహిష్కరించి నిరసన 
- పోలీసుల తీరు మారకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 10:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విధులు బహిష్కరించి నిరసన

- పోలీసుల తీరు మారకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

ప్రజాశక్తి - విజయవాడ : న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని, న్యాయవాదులపై పోలీసులు రౌడీషీట్‌, ఇతర కేసులను మోపేందుకు చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ బుధవారం బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (‌బిబిఎ) ఆధ్వర్యంలో న్యాయవాదులు దీక్షలు చేపట్టారు. తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. విజయవాడ కోర్టు భవన్‌ ‌సముదాయం ఆవరణలో బిబిఎ హాలు వద్ద రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎపి బార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు, ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌ (ఎస్‌ఆర్‌‌పి), ఎపి బార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు చలసాని అజయ్‌‌కుమార్‌, రాగి గంగాభవాని, బిబిఎ అధ్యక్షులు వి.లక్ష్మీనారాయణ మాట్లాడారు. అక్రమ కేసుల ప్రయత్నాలను విరమించుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాదులపై తరుచూ దాడులు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పిస్తూ, బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు వ్యవస్థ రానురాను పక్షపాతంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం చట్టబద్ధంగా, శాంతియుతంగా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించుకునే అవకాశం న్యాయవాదులకే లేకపోతే...ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గురువారం కూడా రిలే దీక్షలు జరుగుతాయని తెలిపారు. దీక్షల్లో న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్‌, అబ్దుల్‌ ‌రజాక్‌, గడ్డం రవికిషోర్‌, పలగాని రవిబాబు, నరహరిశెట్టి జ్యోతి, ఒ సునీత, కె మహేశ్వరి, బి దయామణి, వై సుజాత, బి సౌమ్య, ఎంఎస్‌‌విహెచ్‌ఎస్‌ ‌సుబ్బరామయ్య, కె విజయ్‌‌కుమార్‌, సిహెచ్‌.ఆదామ్‌, పి ప్రశాంతి, పూనురు గౌతంరెడ్డి తదితరులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో బిబిఎ ప్రధాన కార్యదర్శి వి.కిరణ్‌, మహిళా విభాగం సెక్రటరీ ఉషా జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్