- ‘పోలవరం’ పేరిట నష్టం చేస్తే ఊరుకోం
- కూనవరం మండలంలో ఉత్తేజంగా సాగిన సిపిఎం బైక్ యాత్ర
‘మా మట్టి - మా నీరు - మా హక్కు’ నినాదంతో పోలవరం నిర్వాసితుల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన బైకు యాత్ర శనివారానికి మూడో రోజుకు చేరుకుంది. కూనవరం మండలంలోని ముల్లూరు గ్రామంలో మొదలైన యాత్ర పలు గ్రామాల మీదుగా సాగుతూ నిర్వాసితులను చైతన్యపరిచింది. ఈ యాత్రకు ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్దార్కూర్ గ్రామంలోని పాయం సీతమ్మ, పల్లూరు గ్రామంలోని ఆవుల నాగమయ్య అమర వీరుల స్తూపాలకు అంజలి ఘటిస్తూ యాత్ర కొనసాగింది. రేపాక గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ... ప్రతి నిర్వాసితునికీ న్యాయం జరగాల్సిందేనని, అప్పటి వరకూ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గ్రామాలు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ఏజెన్సీలో శత శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జిఒ నెంబర్ 3 పునరుద్ధరణపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని సిఎం చంద్రబాబు విస్మరించడం దారుణమన్నారు. విలీన మండలాల్లో రోడ్లు దుర్భరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలను వేరొక చోటుకు తరలించే వరకూ స్థానికంగానే మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూనవరం మండలంలోని బొజ్జరాయిగూడెం, రేగులపాడు, లింగాపురం, అభిచర్ల, కూటూరు, పెద్దార్కూర్, చిన్నార్కూర్, భీమవరం, పల్లూరు, గొమ్ముఅయ్యవారిగూడెం, అయ్యవారిగూడెం, కాచవరం మీదుగా కూనవరం వరకూ యాత్ర కొనసాగింది. పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజులు, లోతా రామారావు, పల్లపు వెంకట్, నాయకులు పులి సంతోష్, పూనెం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.










కామెంట్లు (0)