శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్వాసితులకు న్యాయం చేయకుండానే వెలిగొండ ప్రారంభమా?

1 గంట క్రితం

ramadevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రత్యామ్నాయం చూపకుండా ప్రాజెక్టు ప్రారంభం

ప్రజలను నిలువునా ముంచడమే : రమాదేవి

ప్రజాశక్తి - ఒంగోలు సిటీ మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పూర్తికావడం ఆనందించాల్సిన విషయమే అయినప్పటికీ, ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన వేలాది నిర్వాసితుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసి రాజకీయ మైలురాయిగా మలచాలన్న ప్రభుత్వ తీరును సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి తీవ్రంగా తప్పుబట్టారు. పునరావాసం, పూర్తి నష్టపరిహారం, ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించకుండానే ప్రారంభోత్సవానికి హడావుడి చేయడం అభివృద్ధి కాదని, ప్రజలను నిలువునా ముంచే చర్యేనని విమర్శించారు. శుక్రవారం ఒంగోలు సుందరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వెలిగొండ నిర్మాణంలో అన్ని ప్రభుత్వాల పాత్ర ఉన్నప్పటికీ, నిర్వాసితులకు న్యాయం చేయడంలో మాత్రం అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయని పేర్కొన్నారు. 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో సొరంగాలు, ప్రధాన నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో నిర్మాణం తుది దశకు చేరుకుందని గుర్తు చేశారు. అయితే, ప్రాజెక్టు నిర్మాణంలో పురోగతి కనిపించినా, భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదని తెలిపారు. ప్రాజెక్టు కోసం 7,500 మంది రైతులు, రైతు కార్మికులు, 11 ముంపు గ్రామాలకు చెందిన సుమారు 35 వేల మంది ప్రజలు తమ భూములు, ఇళ్లు, జీవనాధారాలను కోల్పోతున్నారని వివరించారు. వారి భవిష్యత్తును గాలికొదిలేసి ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రభుత్వ అసలు ప్రాధాన్యతను బయటపెడుతోందన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలోనూ, ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం హాయాంలోనూ నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి నిర్వాసితుడినీ ప్రత్యేక కుటుంబంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గురువారం మంత్రి పర్యటన సందర్భంగా నిర్వాసితులు గంటల తరబడి ఎదురుచూసినా వారి సమస్యలు వినడానికి సమయం కేటాయించకుండా ప్రారంభోత్సవ ఏర్పాట్లు, శిలాఫలకాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. 2009లో నోటిఫికేషన్ జారీ చేసి 2019లో భూసేకరణ చేపట్టినా, 2026 జూన్ నాటికి కేవలం 2,500 మంది రైతులకు మాత్రమే పరిహారం అందిందని, మిగిలిన 4,500 మంది రైతులు ఇప్పటికీ నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ముందుగా పూర్తి స్థాయి పునరావాసం, నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి... ఆ తర్వాతే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలని, లేకపోతే నిర్వాసితులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రమాదేవి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్.కె.మాబు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.వి.కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్