- కుల, మతాలవారీగా చీల్చే కుట్ర
- ఎపిలో మోడీ పల్లకి మోస్తున్న ప్రధాన పార్టీలు
- యువతను రాజకీయాల్లోకి ప్రోత్సహించాలి
- రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో బిజెపి ప్రభుత్వం డీలిమిటేషన్, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఎస్‌ఐఆర్‌తో రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ విమర్శించారు. ఈ మూడు విధానాల ద్వారా 2029లో మళ్లీ బిజెపి గెలవాలని ఆశిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజలందరినీ కుల, మత రాజకీయాలకు అతీతంగా కూడగట్టి మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలన్నారు. ఆదివారం విజయవాడలోని ఎంబివికెలో బివిఎన్ సత్యనారాయణ అధ్యక్షతన ‘రాజకీయ రంగంలో యువశక్తి, జెన్ జీ’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. . బిజెపి గత 12 ఏళ్లుగా మీడియా, కార్పొరేట్ శక్తులను అడ్డుపెట్టుకుని దేశ ప్రగతికి అడ్డుగోడగా నిలిచిందని, దేశ ప్రజలు అర్థం చేసుకొని తిప్పికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు. యువతరం అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేటి సమయంలో వారికి మార్గదర్శకులుగా ఉండి, వాళ్లను ప్రోత్సహిస్తూ నిర్మాణాత్మకమైన ఉద్యమాలకు రూపకల్పన చేయాలన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఉద్యమం కేవలం నీట్ పరీక్ష పత్రాల లీకేజ్‌పై మాత్రమే కాదని, అన్ని వ్యవస్థలపై యువత కన్నెర్ర చేసిందని అన్నారు. ప్రజలను బిజెపి మతాల వారీగా చీల్చే కుట్రను సిజెపి భగ్నం చేసిందన్నారు.
ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుకుమార్ మాట్లాడుతూ.. వ్యక్తి పూజ నిరంకుశత్వానికి దారి తీస్తోందని, అది ప్రజాస్వామ్య మనుగడకే పెను ముప్పుగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ఎపిలోని ప్రధాన రాజకీయ పార్టీలు మోడీ, అమిత్ షా వ్యూహాలకు ఆమోదం తెలుపుతూ యువతను విస్మరించడం సరికాదని, జెన్-జీ ఉద్యమానికి రాష్ట్రంలో స్పందన లేకపోవడం శోచనీయమని అన్నారు. నాటి ఎపిలో వామపక్ష, దళిత ఉద్యమాలు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మోడీ వాట్సప్ యూనివర్సిటీ సందేశాలను నమ్మే స్థితిలో నేటి యువత లేదని, జెన్ జీ ఉద్యమం దేశానికే పురోగమన చర్యగా భావించాలని అన్నారు. దేశమంతా యువతరం కదులుతున్నప్పటికీ, రాష్ట్రంలో స్పందన తగినంత లేదన్నారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేటి వరకు యువతను రాజకీయాల్లోకి రాకుండా (డీపొలిటిలైజేషన్) చేశారన్నారు. తెలుగు విద్యార్థి విభాగాన్ని చంద్రబాబు రద్దు చేశారని, అధికారం, రాజకీయ అవసరాల కోసం మరల పునరుద్ధరించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90 శాతం ప్రాతినిధ్యం వహించే పార్టీలు (టిడిపి, వైపిసి, జనసేన) మోడీకి కొమ్ముకాస్తూ, పల్లికిని మోస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యల మీద ఉద్యమాలు, ధర్నాలు చేస్తామంటే నిర్భందాలు, భయపెట్డడం చేశారన్నారు. తొమ్మిదో తరగతి నుంచే కోచింగ్ సెంటర్లు, కౌన్సిలింగ్లు, విదేశీ విద్యా పేరుతో యువత రాజకీయాల్లోకి రాకుండా వారి తల్లిదండ్రులను బెదిరించే పనులను ప్రభుత్వాలు చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత దేశమంతా కాంగ్రెస్‌ను ఓడిస్తే రాష్ట్రంలో ప్రజలు గెలిపించిన పరిస్థితులు ఉన్నాయన్నారు. సారా ఉద్యమాన్ని దేశానికి మార్గదర్శకంగా ఎపి చూపిందన్నారు. దేశ రాజధానిలో జరిగిన ఉద్యమం.. నేడు ఎపిలో జరిగి తీరుతుందని, ఇందులో ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. వెనుకబడిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి యువతకు ఉద్యోగాల కొరతతో యువతరం తిరుగుబాటు చేసి తీరుతుందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. సామాజిక, రాజకీయ మార్పులను కోరుకునే శక్తులకు జెన్ జీ ఉద్యమం ఆశ కల్పిస్తుందన్నారు. యువతలో అసంతృప్తికి నిదర్శనంగా జెన్ జీ ఉద్యమం రూపుదిద్దుకుందని, నేడు జెన్ ఆల్ఫా పేరిట పిల్లలు ప్రభుత్వ పాఠశాలల ప్రక్షాళన కోసం ఉద్యమించడం అభినందనీయమన్నారు. బిపి మండల్ ట్రస్ట్ అధ్యక్షులు ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసమే బిపి మండల ట్రస్ట్ పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పాలకవర్గాలు సామాజిక న్యాయానికి నిరంతరం తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులిస్తున్నారని పేర్కొన్నారు. నాటి కిసాన్ ఉద్యమాలు, నేటి జెన్ జీ ఉద్యమం బిజెపి ప్రభుత్వ మెడలు వంచాయని, దేశంలో ప్రజలు అసమానతలు లేని సామాజిక న్యాయం కోసం ఉద్యమించి బిజెపి పాలనకు ముగింపు పలుకుతారని తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నాటి స్వాతంత్ర్య ఉద్యమంలో యువత పాత్ర ఉందని, నేడు మరో స్వాతంత్ర్య ఉద్యమానికి యువత సిద్ధమవుతుందని వివరించారు. మాజీ ఐఎఎస్ అధికారి జిఎస్ఆర్ కెఆర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో 80 శాతంగా ఉన్న దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనారిటీలు, నిరుపేదల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్నకుమార్, పిడిఎస్ఒ కార్యదర్శి భాను, ఎఐఎస్ఎఫ్ అధ్యక్షులు నాసర్ జీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగంధర్, వైసిపి విద్యార్థి విభాగ అధ్యక్షులు పి చైతన్య, జెన్ జీ యాక్టివిస్ట్ మేఘా రెడ్డి, ఎన్ఆర్ ధారా తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)