శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయ పాల ధర పెంపుకు నిరసనగా ... విజయవాడలో సిపిఎం ఆందోళన, ధర్నా

1 గంట క్రితం

విజయ పాల ధర  పెంపుకు నిరసనగా ... విజయవాడలో సిపిఎం ఆందోళన, ధర్నా
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 03:41 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • హెరిటేజ్ ,ప్రైవేటు డెయిరీ ప్రయోజనాల కోసం విజయ డయరీని బలి తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం

  • కృష్ణా పాల సహకార సంఘంపై టిడిపి ప్రభుత్వ పెద్దల పెత్తనం అక్రమం

  • విజయ డైరీ ఆస్తులపై కన్నువేసిన ప్రభుత్వ పెద్దలు

  • నాలుగు నెలల్లో మరోసారి పాల ధరల పెంపు శోచనీయం

  • నాడు అముల్...నేడు హెరిటేజ్.. పేరుతో రైతుల, వినియోగదారుల సహకార సంఘాన్ని నాశనం చేస్తున్న పాలకులు

  • ప్రభుత్వ పెద్దల కబంధహస్తాల నుండి విజయ డైరీనీ కాపాడుకోవాలి, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి -సిహెచ్ బాబురావు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు


విజయవాడ : కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్ విజయ పాల ధరలను ఆగస్టు 10వ తేదీ నుండి లీటర్ కు రెండు రూపాయలు పెంచాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఏప్రిల్ లో లీటర్ రెండు రూపాయలు పెంచిన విజయ డైరీ.. 4 నెలల తిరగక ముందే మరోసారి పెంచడం గర్హనీయమన్నారు. పాల ధరల పెంపును విజయ డైరీ ని కబ్జా చేయడానికి ప్రభుత్వ పెద్దలు.. మంత్రుల ద్వారా చేస్తున్న కుట్రలకు నిరసనగా శనివారం సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ, లెనిన్ సెంటర్ లోని.. విజయ డైరీ వద్ద ధర్నా, ఆందోళన చేపట్టారు. పాల ధరల పెంపును నిరసిస్తూ , విజయ డైరీ ని రక్షించాలని నినాదాలు చేశారు. బాల, బాలికలు విజయ పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్ మాట్లాడుతూ .... నాలుగు నెలలు తిరగక ముందే మరోసారి పాల ధరలు పెంచడం అన్యాయమన్నారు. బియ్యం, పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయన్నారు. పాల ధరల పెంపు వలన విజయవాడ, పరిసర ప్రాంతాల ప్రజలపై సంవత్సరానికి 36 కోట్ల రూపాయలను సంవత్సరములో మూడుసార్లు పెంపుతో 100 కోట్ల రూపాయల భారం పడిందన్నారు. అత్యవసరం, నిత్యవసరమైన పాలను కూడా పిల్లలకు, సామాన్యులకు అందుబాటులో లేకుండా పాలకులు చేయడం దుర్మార్గమన్నారు. హెరిటేజ్, ప్రైవేటు డైరీలను ప్రోత్సహిస్తూ సహకార సంఘాలను ప్రభుత్వంలోని పెద్దలు నాశనం చేస్తున్నారనీ, రాష్ట్రంలో ఎన్నో సహకార సంఘాలు మూతపడ్డాయన్నారు. ప్రైవేటు డైరీల ,పాలకుల కుట్రలు ఎదుర్కొని విజయ డైరీ ,కృష్ణ సహకార సంఘం నిలబడిందన్నారు. 1,50,000 మంది రైతుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ డైరీని కబ్జా చేయటానికి కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని అన్నారు. సాఫీగా నడుస్తున్న సహకార సంఘంలో చిచ్చుపెట్టారని, తమ స్వప్రయోజనాల కోసం రైతుల, ప్రజల ప్రయోజనాలను బలి చేయటం నేతలకు తగదు అని చెప్పారు. ఈ కుట్రలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాధ్యత వహించాలని, వీటిని నివారించాలని కోరారు. అధికారం ఉందనే అహంకారంతో, అప్రజాస్వామికంగా సహకార సంఘంలో జోక్యం చేసుకొని, ఏకపక్షంగా వ్యవహరించటం అన్యాయమన్నారు. హెరిటేజ్ డైరీలో డైరెక్టర్లను మార్చుకునే అధికారం వారికి ఉండవచ్చు, సహకార సంఘంపై పెత్తనం చేసే అధికారం ప్రభుత్వానికి, మంత్రులకు ఎవరు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చైర్మన్ పై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా రాజీనామా చేయించడం అమానుషమన్నారు. పాల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపటం, డైరీని కబ్జా చేయటం, హెరిటేజ్, ప్రైవేటు డైరీలకు ప్రయోజనం కలిగించడం పాలకుల లక్ష్యంగా కనబడుతోందన్నారు. విజయ డైరీ పరిణామాలు తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయం కాదనీ, రైతులు ,వినియోగదారులు, సహకార సంస్థను శాసించే అధికారం ప్రభుత్వానికి, మంత్రులకు లేదు అని అన్నారు. విజయ డైరీ పాల ధరల పెంచి ... ప్రైవేటు డైరీలు కూడా ధరలు పెంచుకోవడానికి దారి చూపుతున్నదన్నారు. గత ప్రభుత్వం అమూల్ సంస్థతో కుమ్మక్కయి రైతుల, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీయటానికి ప్రయత్నించిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వ పెద్దలు హెరిటేజ్, తమ స్వప్రయోజనాల కోసం సహకార సంఘాన్ని దెబ్బతీయటం అన్యాయమన్నారు. తమ స్వప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు నిబంధనలు గాలికి వదిలి, అన్ని ప్రమాణాలను దిగజార్చి అడ్డగోలు చర్యలకు పూనుకోవటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పెంచిన పాల ధరల నిర్ణయాన్ని రద్దు చేయాలని, విజయ డైరీలో ప్రభుత్వ పెద్దల జోక్యం విడనాడాలని డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ ని కాపాడాలని, రైతుల, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. పాల ధరలు తగ్గించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ధర్నాలో సిపిఎం నేతలు బోయి సత్యబాబు, బి. రమణరావు, పి.కృష్ణ, ఇవి.నారాయణ, టీ.ప్రవీణ్, కాజా, సరోజ ,గాదే ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

image


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్