విజయవాడ : ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని, కుటుంబంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. గురువారం పున్నమిఘాట్లో జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ .. దుర్గాదేవి ఉత్సవాల నేపథ్యంలో పున్నమిఘాట్లో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో భాగంగా ‘లఖ్పతి దీదీ’ మేళాను నిర్వహించడం ఒక విశేషమైన కలయికగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధి అంటే గ్రామాల వికాసమని అన్నారు. మహిళల స్టాళ్లను సందర్శించే అవకాశం దక్కిందన్నారు. ఒకప్పుడు మహిళలు వెనుకబడి ఉండేవారని.. కేవలం కుటుంబ సంరక్షణకే పరిమితమై, ఆర్థికంగా చిన్న చిన్న అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ నేడు మహిళలు సంపూర్ణంగా స్వయం సమృద్ధి సాధించారన్నారు. మహిళలు కేవలం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ఇతరులకు కూడా ఆసరాగా నిలుస్తున్నారని ముర్ము తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనలో మహిళల భాగస్వామ్యం కీలకమని అన్నారు. వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని రాష్ట్రపతి వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక, సాంకేతిక సామాజిక సాధికారత దిశగా కొత్త మార్గం లభించిందన్నారు. ప్రస్తుత గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మంది మహిళలు రాజకీయాల్లో భాగస్వాములవుతున్నారని ద్రౌపది ముర్ము తెలిపారు. డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధనం వంటి ఆధునిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ, వారికి నైపుణ్యాభివృద్ధిలో కొత్త అవకాశాలు లభిస్తున్నాయని ముర్ము అన్నారు. గవర్నర్గా ఉన్న సమయంలో అక్కడి గ్రామీణ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. ఆ మహిళలు ల్యాప్టాప్లను ఉపయోగిస్తూ ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం పొందుతున్నారు, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అనే వివరాలను స్వయంగా ల్యాప్టాప్లలో నమోదు చేసుకుంటూ పనులు చేసుకునేవారని తెలిపారు. ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని, కుటుంబంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 03:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)