- యువతలో అనూహ్య మార్పు వస్తోంది
- జాతీయ పతాకావిష్కరణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
- ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న మోడీ పాలన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కమ్యూనిస్టులతోనే దేశ స్వాతంత్య్ర పరిరక్షణ సాధ్యమవుతుందని, యువతలో అనూహ్య మార్పులు వస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్‌వాళ్లకు వ్యతిరేకరంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు, వాటి లక్ష్యాలను సాధించేందుకు దేశ ప్రజలు వివిధ రూపాల్లో ఇంకా పోరాడుతూనే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్‌తోపాటు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వంటి అనేకమంది యోధులు ప్రాణత్యాగాలు చేసి ఈ దేశ స్వాతంత్రానికి పునాది వేశారని అన్నారు. స్వాతంత్య్రానంతరం ఆర్థిక అసమానతలు పోతాయని సామాజిక సమానత్వం సాధించగలుగుతామని ఆశించినటువంటి కోరిక నెరవేరలేదని అన్నారు. 70 సంవత్సరాల తర్వాత ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి మతోన్మాదం ఒక శనిలా దాపురించిందని అన్నారు. ప్రజలను మతం పేరుతో, దేవుడి పేరుతో, భక్తి పేరుతో చీల్చి వైషమ్యాలు పెంచి ఒకళ్ల మీద మరొకరిని ఉసిగొలిపేటువంటి విషపూరిత వాతావరణం నెలకొందని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారంలో పూర్తిగా విఫలమై మతోన్మాదం వంటి విషనాగుని పెంచి పోషిస్తోందని తెలిపారు. స్వాతంత్య్రాన్ని ఏ రకంగా సాధించుకున్నాం అనే విషయాలను పక్కనబెట్టి మోడీ ప్రభుత్వం దేశ విభజన గురించి మాట్లాడుతోందని అన్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ ప్రధానమంత్రి అయి ఉంటే దేశం ఒకటిగా ఉండేదని ఇంతకుముందు చెప్పేవాళ్లని, ఇప్పుడు దాన్ని వదిలేశారని అన్నారు. అప్పట్లో మోడీ ప్రధానమంత్రి అయి ఉంటే దేశం ఒకటిగా ఉండేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజంగా ఆరోజు మోడీ లాంటి వ్యక్తి ఉంటే దేశం 50 ముక్కలయి ఉండేదని విమర్శించారు. అప్పట్లో జనసంఘ్‌గా ఉన్న ప్రస్తుత ఆర్‌ఎస్‌ఎస్ స్వదేశీ సంస్థానాలన్నీ కూడా ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా ఉండాలంటూ ప్రచారం చేసిందని అన్నారు. దేశంలో హిందూ ముస్లిం ఘర్షణ జరగకూడదని గాంధీ దీక్ష చేస్తే ఆయన్ను చంపిన కర్కోటకుడు గాడ్సేని బిజెపి వాళ్లు దేవుడిగా పూజిస్తూ దేశ ద్రోహానికి తలపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళ ఒత్తిడికి లొంగి మతోన్మాదాన్ని పెంచి పోషిస్తోందని అన్నారు. క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రభుత్వమే ప్రచారం చేస్తోందని, దాడులు సాగిస్తుంటే వాళ్ళ పట్ల మెతకవైకరి అవలంభిస్తోందని విమర్శించారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌కు దూరంగా ఉన్న మతోన్మాదం అధికార పార్టీ పుణ్యమా అంటూ రాష్ట్రంలో కూడా పెచ్చరిల్లిపోతోందని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ సమైక్యతను, మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి సిపిఎంగా ఈ సందర్భంలో ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలిపారు. బెంగాల్‌ను బ్రిటీష్‌వాళ్లు మత ప్రాతిపదికన చీలిస్తే దానికి వ్యతిరేకంగా హిందూ ముస్లింలు ఒక్కటే అనే ఐక్యతను చాటడానికి ఆరోజు వందేమాతరం అనే స్లోగన్ తోడ్పడిందని అన్నారు. ఆ తర్వాత భగత్ సింగ్ వంటి పోరాట యోధుల త్యాగాల్లో నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం వచ్చిందని తెలిపారు. ఢిల్లీ విద్యార్థి ఉద్యమంలో భగత్ సింగ్ ఫోటో పెట్టుకొని యువతరం అంతా కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదం ఇవ్వడం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. సుభాష్ చంద్ర బోస్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి జై హింద్ అనే నినాదాన్ని తీసుకొచ్చాడని తెలిపారు. ఈ పోరాటాలు అన్నిటిలో ఉన్నటువంటి యోధులు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారన్నారు. సుభాష్ చంద్ర బోస్ మిలటరీ అయిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో మహిళా విభాగానికి అధిపతిగా ఉన్న లక్ష్మీ సెహగల్ అనంతరం సిపిఎంలో ప్రముఖ నాయకులుగా ఉన్నారని తెలిపారు. భగత్ సింగ్ అనుచరులందరూ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి తమ పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. ఎంతో మంది దేశం కోసం ప్రాణతాగ్యాలు చేస్తుంటే అండమాన్ జైల్లో ఉన్నసావర్కర్ బ్రిటిష్ వాళ్లకు లొంగిపోయి క్షమాభిక్ష కోసం 12 సార్లు ఉత్తరం రాసి బయటపడ్డాడని అన్నారు. అనంతరం హిందూత్వ మతోన్మాదానికి పునాది వేసి బ్రిటిష్ వాళ్ళకు సహకరించి స్వాతంత్రోద్యమానికి వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు. జనగణమన స్థానంలో హిందూ మత గీతాన్ని ఖచ్చితంగా పాడాలంటూ కేంద్రం ఇటీవల చట్టం చేసిందని తెలిపారు. 20 రోజుల పాటు పార్లమెంట్ జరిగితే ముఖం చాటేసిన ప్రధాని, హోమ్‌మంత్రికి జాతీయ గీతం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. మన దేశం, రాష్ట్రం వివిధ జాతులు, భాషలు, సంస్కృతుల సమ్మేళనమని, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటిదని అన్నారు. తమిళనాడులో వారి రాష్ట్ర గీతాన్ని పాడుతున్నారని, మన రాష్ట్రంలో మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాట పాడతారా లేదా చెప్పాలన్నారు. దేశభక్తి అంటే మతోన్మాదం కాదని, కులానికి మతానికి అతీతమైందని తెలిపారు. పాలకులు ఈ రోజు విదేశీ పెట్టుబడిదారులకు ద్వారాలు తెరిచి భూభాగాన్ని ముక్కలు ముక్కలుగా అమ్మేస్తున్నారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా ఆర్థిక సామాజిక అసమానతలను అరికట్టకుండా దేశభక్తి, జాతీయ సమైక్యత గురించి మాట్లాడేటువంటి హక్కు పాలకులకు లేదని అన్నారు. ఐక్యత, మత సామరస్యం, ఆర్థిక సామాజిక సమానత్వం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులు మాత్రమే నేడు నిజమైన దేశభక్తులని అన్నారు. ఇప్పుడు పోరాడే, ప్రశ్నించే, ఎదురు తిరిగే తరం వస్తోందని వారి చైతన్యంతో తిరిగి భారతదేశం పురోగమిస్తుందనే ఆశ కలుగుతోందని తెలిపారు. ఖచ్చితంగా భవిష్యత్ కమ్యూనిస్టులదేనని అన్నారు. జాతీయోద్యమ స్ఫూర్తిని దాని వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయి మరింత బలపరిచేటువంటి శక్తిగా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు వస్తుందని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 80వ సంవత్సరం వచ్చినా కేంద్రంలో ఉన్న బిజెపి పాలకులు సర్ పేరుతో ఎన్నికల వ్యవస్థను తొత్తడం చేస్తున్నారని అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కులను నిలబెట్టుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ముక్తకంఠంతో పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె.జయరాం అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, కె.ప్రభాకరరెడ్డి, సి.హెచ్.బాబురావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)