ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పాత పెన్షన్ సాధనే ధ్యేయం

4 గంటల క్రితం

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 09:02 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సాధన దశాబ్దాల పోరాట ఫలితం

- సిపిఎస్‌ అంతం, మన పంతం నినాదంతో ఉద్యమం

​- పెన్షన్‌ భిక్ష కాదు.. ఉద్యోగుల హక్కు

- నిర్భందాలే పోరాట పటిమను మరింత పెంచాయి

- యుటిఎఫ్ నేతలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దశాబ్దాలుగా సాగించిన విరామం ఎరుగని పోరాటాల ఫలితంగానే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ సాధ్యమైందని, ఇదే పోరాట స్ఫూర్తితో రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ​విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పోరాట వీరుల విజయోత్సవ సభ’లో పలువురు నేతలు మాట్లాడారు.యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ వెంకటేశ్వర్లు సభకు అధ్యక్షత వహించారు. ఎంఎల్ సి బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ ఉద్యమాల సమయంలో ఉపాధ్యాయులు, మహిళలు అనే తేడా లేకుండా పాలకులు కేసులు, అరెస్టులు, నిర్బంధాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇలాంటి నిర్బంధాలు ఉద్యమకారుల పోరాట పటిమను మరింత పెంచుతాయని పేర్కొన్నారు. మాజీ ఎంఎల్ సి ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభమైన పాత పెన్షన్‌ పోరాటం నేటికీ ఫలితాన్ని ఇచ్చిందన్నారు. సిపిఎస్‌ను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని, ఈ సమస్యను సృష్టించింది పాలకులే కాబట్టి పరిష్కరించాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.పిడిఎఫ్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తాము పోరాడి సాధించిన సమస్యపై ఏ మాత్రం పోరాడని వారు సమస్యను సృష్టించిన వారికే పాలాభిషేకాలు చేయడం విచిత్రంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో 57 వచ్చి ఎన్నో సంవత్సరాలు గడిచినా దానిని అమలు కాకుండా అడ్డుకున్నవారే ఇప్పుడు తామే పాత పెన్షన్‌ ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.యుటిఎఫ్ పోరాట వీరులతో విజయోత్సవ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ ఎంఎల్ సి కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ పెన్షన్‌ భిక్ష కాదని ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ పాలకులు దానిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెన్షన్‌ సమస్యను మరుగున పడకుండా సజీవంగా ఉంచి నిరంతరం పోరాటాలు చేస్తోన్నది యుటిఎఫ్‌ మాత్రమేనని అన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ సాధించిన విజయంతో పొంగిపోకుండా సిపిఎస్‌ అంతం, మన పంతం” అనే నినాదంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ సాధన అనేది ఎవరో చేసిన ప్రాతినిధ్యాల వల్లనో, ఎవరైనా జాలిపడి ఇచ్చిన వరంగానో భావించరాదన్నారు. ఎన్నో ఏళ్లుగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో సాగిన పోరాటాల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త అభినందనీయుడని అన్నారు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు కె జోజయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నోసార్లు యుటిఎఫ్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినా సంఘం రాజీపడలేదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల సాధనలో ఇతర సంఘాలకు భిన్నంగా యుటిఎఫ్‌ పోరాట పంథాను కొనసాగిస్తూ ఫలితాలు సాధిస్తోందన్నారు. అమరజీవుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ పోరాటానికి సంబంధించిన నివేదికను సభలో వివరించారు. 2019కు ముందు అప్పటి ముఖ్యమంత్రి సిపిఎస్‌ రద్దు సాధ్యం కాదని చెప్పిన పరిస్థితుల్లో, ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వస్తే వారంలోనే సిపిఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలోయుటిఎఫ్‌ అనేక ఉద్యమాలను నిర్వహించిందన్నారు. మహాపాదయాత్ర, సంకల్పదీక్ష, మూడు విడతలుగా నిర్వహించిన రణభేరి కార్యక్రమాలతో పాటు అనేక ఆందోళనలు చేపట్టామని తెలిపారు.ఈ పోరాటాల సందర్భంగా కేసులు, అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కొన్నప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదని, వారి పోరాట స్ఫూర్తిని అభినందించేందుకే విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సిపిఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ సాధన కోసం నిర్వహించిన పాదయాత్రలు, నిరాహార దీక్షలు, వివిధ ఉద్యమాల్లో పాల్గొని కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలను సభలో ఘనంగా సత్కరించారు. వారికి కండువాలు, గోల్డ్‌, సిల్వర్‌, బ్రాస్‌ మెడల్స్‌తో పాటు ప్రశంసా పత్రాలు, ‘ఉద్యమ ఘట్టాలు’ పుస్తకాలను అందించారు. సీనియర్‌ నాయకులు ఎన్‌ కుమార్ రాజా, కె సంజీవరెడ్డి, ఎస్‌ జయప్రభ పాల్గొన్న వక్తలను కండువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, సహాధ్యక్షులు కె సురేష్‌కుమార్‌, ఎఎస్‌ కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శులు ఎస్‌పి మనోహర్‌కుమార్‌, ఎస్‌ మురళీమోహనరావు, ఎస్‌ఎస్‌ నాయుడు, ఎన్‌ నవకోటేశ్వరరావు, కెఎ ఉమామహేశ్వరరావు, బి సుభాషిణి, జివి రమణ, వి శ్రీలక్ష్మి, టివిజిజిఆర్‌ఆర్‌ చక్రవర్తి, ఎస్‌ జయచంద్రారెడ్డి, జయకర్‌, ఎస్‌ రవి, కె శ్రీనివాసరావు, ఎన్‌ దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ టిఎస్‌ఎల్‌ఎన్‌ మల్లేశ్వరరావు, ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం హనుమంతరావు, 26 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్