శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

"సర్ " తో ఓటు హక్కుకు ముంచుకొస్తున్న ప్రమాదం

1 గంట క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 09:43 అపరాహ్నం | 5 నిమిషాల చదవడం

- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు

- ఓటు పరిరక్షణ వేదిక ఏర్పాటు

- పుట్టుకనే ప్రశ్నించే విధంగా నోటీసులు

- ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఓటర్ల ప్రత్యేక సవరణతో ఓటు హక్కుకు ప్రమాదం ముందుకొస్తోందని, దీన్ని అడ్డుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. ‘'ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు` అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం విజయవాడ బాలోత్సవ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు వక్తలను ఆహ్వానించారు. 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని అందరూ ఏక్రగీవంగా ఆమోదించడంతోపాటు మరికొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ప్రారంభిస్తూ వి.శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటరు కీలకమని, రాజకీయ పార్టీలు, ఓటర్లు లేకుండా ప్రజాస్వామ్యం ఉండదని అన్నారు. ఈ సమయంలో ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించేందుకు చేస్తున్న ప్రక్రియ అన్యాయమైందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాల్సిన ఎన్నికల సంఘం ఉన్న ఓట్లను తొలగిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఓటరుగా నమోదు చేసుకోవడం, తానే ఓటరునని నిరూపించుకునే బాధ్యత కూడా ఓటరుపైనే నెట్టేశారని విమర్శించారు. పైగా పౌరసత్వ సమస్యను దీనికి లింకు చేశారని పేర్కొన్నారు. 1987 కంటే ముందు పుట్టినవారు కూడా ఓటు హక్కును నిరూపించుకోవాల్సి రావడం అన్యాయమని, కొత్త ఓటర్లను చేర్చుకోకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వలసలు ఎక్కువగా ఉన్నాయని, అలాంటి వారిలో 22 లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారని తెలిపారు. ఎస్‌ఐఆర్ లో జరిగే తప్పులను సరిచేసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని పేర్కొన్నారు. ఎపిలో తెలుగును ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉన్నా ఇంగ్లీషులో వచ్చే తప్పుల ఆధారంగా నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. దొంగ ఓట్లపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకోవచ్చని అటువంటిదేమీ లేకుండానే నోటీసులు ఇచ్చి వేధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గ్రామ/ వార్డు సభలు పెట్టి ఓటర్లకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ లో ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న పద్దతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు లేకుండా చేస్తున్నారని, సుప్రీం కోర్టు సూచనల ప్రచారం అక్షర దోషాలు సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘానిదే అయినా ఓటరుపైనే దాన్ని నెట్టేస్తున్నారని విమర్శించారు. ఓటు నమోదు చేసుకునే గడువు సెప్టెంబర్ ఆఖరు వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.

తీర్మానం ప్రవేశపెట్టిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. వ్యవస్థీకృతంగా ఉన్న చట్టాలను ధిక్కరించి ఎస్‌ఐఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. ఈ ప్రకియతో 66 లక్షల మంది ఓటు హక్కును కోల్పోతారని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 22 లక్షల మందిని తొలగించారని, మరో 44 లక్షల మందికి నోటీసులిచ్చారని పేర్కొన్నారు. ఈ చర్యలతో పౌరసత్వం ప్రమాదంలో పడుతుందని తెలిపారు. తండ్రికి కొడుకుకి మధ్య వయస్సులో తేడా ఉందనీ, పిల్లలు ఎక్కువగా ఉన్నారనీ నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. ఈ చర్య భారతీయుడి పుట్టుకనే ప్రశ్నించేవిధంగా ఉందని తెలిపారు. ఎస్‌ఐఆర్ పెట్టిన ఉద్దేశంలోనే మౌళికంగా కుట్ర ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు బదిలీలైనవారు, అడ్రస్ మారినవారు ఎక్కువమంది ఉన్నారని అటువంటి వారందరి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు వారిపైనే నెట్టారని, ఇది సరైన పద్ధతి కాదని తెలిపారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ షాక్ కొట్టేలా ఉందని, దీని ద్వారా దేశ రాజకీయాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘానికి పిచ్చిపట్టినట్లు ఉందని విమర్శించారు. దీన్ని ఎందుకు నిర్వహిస్తున్నారో సిబ్బందికి కూడ తెలియదని పేర్కొన్నారు. ఇది మొత్తం బిజెపి సృష్టించిన విధ్వంసమని తెలిపారు. వైసిపి సీనియర్ నాయకులు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ మొత్తం బాధ్యతారాహిత్యంగా జరిగిందని, ఇంటింటికీ వెళ్లి ఓటరు ఫారాలు ఇచ్చి తీసుకోవాల్సిన సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని ఓటు నమోదు చేశారని అన్నారు. వారికి ఖాళీ ఉన్నప్పుడు పనిచేశారే తప్ప చట్టబద్ధంగా ఇంటింటికీ వెళ్లలేదని వివరించారు. నోటీసులు ఇవ్వడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం అనేక పధకాలు పెట్టి బిఎల్‌ఓలను ఆ పనుల్లోకి పంపించిందని అన్నారు. డ్రాఫ్ట్ ఓటరు లిస్టులో పేరున్న వారికి కూడా నోటీసులు ఇచ్చారని, 18 సం‌వత్సరాలు నిండిన వారిని ఓటరుగా చేర్చలేదని పేర్కొన్నారు. మొదటి ఓటు హక్కునే నిరాకరిస్తున్నారని అన్నారు. సిపిఎం ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు.

ఎపిసిసి నాయకులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ బిజెపి విధానాలతో దేశంలో ఈడి, సిబిఐ ఎంత అభాసు పాలయ్యాయో ఎన్నికల సంఘం కూడా ఎస్‌ఐఆర్ పెట్టి అంతే అభాసు పాలైందని తెలిపారు. యువతలో మార్పు వస్తోందని, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపైనా ప్రశ్నించి ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ఎపి బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాదు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ అంటే మోడీ, షాల ఓటర్ల ఎంపిక విధానమని అన్నారు. వారికి కావాల్సిన వారిని ఓటరుగా పెట్టుకునే విధంగా దీన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటు ఇవ్వకుండా తిరస్కరిస్తున్న వారికి ఉన్న అర్హత ఏమిటో ముందు తేల్చాలన్నారు. ఓటు లేదని పాస్‌పోర్టు కూడా ఆపేస్తున్నారని, ఓటు లేకుండా చేయడం ద్వారా వారిని భారత పౌరులుగా కాకుండా చేయాలనే కుట్రతో ఎస్‌ఐఆర్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంతకుముందు ఎస్‌ఐఆర్ అమలు చేసిన రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను కూడా నిలిపేస్తున్నారని వివరించారు. మనుధర్మశాస్త్రం స్థితికి ఓటర్లను తీసుకెళుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

న్యూడెమెక్రసీ నాయకులు పి.ప్రసాదు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్లో జరుగుతున్న అక్రమాలపై ప్రజా ఆందోళన లేవనెత్తాలని అన్నారు. బిజెపి అప్రజాస్వామిక విధానాలకు నిలువుటద్దంగా ఈ విధానం ఉందని విమర్శించారు.

జనచైతన్యవేదిక కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఏది అనుకుంటే అది చేసేలా ఎన్నికల కమిషన్ మారుతోందని తెలిపారు. అక్షరాస్యతలో వెనుకున్న ఎపిలో ఉపాధి కోసం వలసలు పోయేవారు ఎక్కువగా ఉన్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మైనార్టీ ఓట్లను తొలగించేందుకు పెట్టిన ఎస్‌ఐఆర్ ను ఇప్పుడు దేశం మొత్తం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పేదలంటే కేంద్రానికి ఏ మాత్రమూ గౌరవం లేదని తెలిపారు.

ఎంసిపిఐయు నాయకులు ఎం.వెంకటరెడ్డి మాట్లాడుతూ దీర్ఘకాలం తాము అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో బిజెపి ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. బెంగాల్, బీహార్, అస్సాంలో సర్ అనంతరం ఏమి జరిగిందో కనిపిస్తోందని తెలిపారు.

మాజీ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు పెరగాల్సి ఉన్నా ఎస్‌ఐఆర్ పేరుతో తగ్గించేస్తున్నారని అన్నారు. ఓటు హక్కును తిరస్కరించడం రాజ్యాంగ ద్రోహమవుతుందని తెలిపారు. కుల, మత, జాతితో సంబంధం లేకుండా ఓటు హక్కు కల్పించాలని, పేదరికం ఉన్న చోట వారిపట్ల మానవత్వంగా వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వాలు చేస్తున్న ఇటువంటి దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. వీటిపై హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి దుర్మార్గాలను అరికట్టాలని తెలిపారు.

మేలుకో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ ఆగస్టు 30లోపు సర్‌లో దరఖాస్తు చేసుకోకపోయినా, నోటీసుకు వివరణ ఇవ్వకపోయినా జీవితంలో ఓటు పొందే హక్కు కోల్పోతారని, దీనివల్ల పౌరసత్వం ప్రశ్నార్థకంలో పడుతుందని అన్నారు. నియోజకవర్గానికి 2000 ఓట్లు పోయినా మొత్తం రాజకీయవ్యవస్థ దెబ్బతినిపోతుందని పేర్కొన్నారు. ఓటర్ల నమోదుకు గడువు పొడిగించాలని కోరారు.

సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు ఉదయ్ మాట్లాడుతూ దేశంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, డీటెన్షన్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారని తెలిపారు. ఈ సమావేశానికి తెలుగుదేశం, జనసేన పార్టీలను కూడా ఆహ్వానించినప్పటికీ ఎవరూ రాలేదు.

ఓటు పరిరక్షణ వేదిక ఏర్పాటు

రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో అవకతవకలను సరిదిద్ది ప్రతి ఒక్క ఓటును కాపాడేందుకు ప్రముఖ అడ్వకేట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ గారు కన్వీనర్‌గా, ప్రముఖ వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటు పరిరక్షణ వేదిక ఏర్పాటు చేస్తూ రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మాజీ డిజిపి ఎ.బి.వెంకటేశ్వరరావు, కె.ఎస్.లక్ష్మణరావు, వి.లక్ష్మణరెడ్డి, రమేష్‌పట్నాయక్, కుర్ర వసుంధర ఉన్నారు. వివిధ ప్రజాసంఘాల, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సంప్రదించి కమిటీ తుది జాబితా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఓటు హక్కు పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అర్జీ సమర్పించాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్