బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికృష్ణ కేసు దర్యాప్తుపై ‘సుప్రీం’ ఆగ్రహం - మధ్యంతర ఉత్తర్వులు అమలుపై నేడు నిర్ణయం

1 గంట క్రితం

సాయికృష్ణ కేసు దర్యాప్తుపై ‘సుప్రీం’ ఆగ్రహం
- మధ్యంతర ఉత్తర్వులు అమలుపై నేడు నిర్ణయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో

గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి అదృశ్యమవడం, ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడంలో జాప్యం, పోలీస్టేషన్‌లోని సిసిటివి ఫుటేజీ ధ్వంసం కావడం, ఇప్పటికీ మృతదేహం ఆచూకీ లభించకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ కేసును తామే పర్యవేక్షిస్తామని స్పష్టం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కొనసాగుతున్న విచారణపై స్టే విధించింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులనూ తమకు బదిలీ చేయాలని ఆదేశించింది.


సాయికృష్ణ కేసులో సీనియర్‌ పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వైసిపి ఎంపి గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మసీహ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘డిజిపి నిద్రపోతున్నారా? సిసిటివి ఫుటేజ్ ధ్వంసం చేస్తే ఎసిపి చూస్తూ కూర్చున్నారా? మీ డ్యూటీ మీకు తెలియదా? మీ తీరు ఘోరంగా ఉంది. పోలీసుల దర్యాప్తు తీరు ఆందోళనకరంగా ఉంది’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్‌ ఎందుకు లేదు?

సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ వెంటనే ఎఫ్ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మే 28న సాయికృష్ణ అదృశ్యంపై డిజిపికి ఫిర్యాదు అందినట్లు పిటిషనర్‌ తరపున సీనియర్ న్యాయవాది నిఖిల్ గోయల్.. ధర్మాసనానికి వివరించారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్‌ నమోదులో జాప్యంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తి అదృశ్యం కావడం చట్టవిరుద్ధమని పేర్కొంది. సాయికృష్ణ మృతదేహం ఇంతవరకు లభించకపోవడం దర్యాప్తు తీరుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోందని పేర్కొంది.

సుప్రీంకోర్టుకు హైకోర్టు కేసులు బదిలీ

సాయికృష్ణ కేసుకు సంబంధించిన హైకోర్టులోని అన్ని పిటిషన్లు, రికార్డులను తమకు బదిలీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. సెప్టెంబరు 30లోగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 12కు తదుపరి విచారణ వాయిదా వేసింది. అయితే ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, పోలీస్ కమిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మళ్లీ వాదనలు వినిపించారు. దీంతో సాయికృష్ణ అదృశ్యం కేసుపై సుప్రీంకోర్టులో రెండు సార్లు విచారణ జరిగినట్లు అయింది. ఎపి హైకోర్టు కొన్ని పిటిషన్లపై విచారణ ముగించి తీర్పు వాయిదా వేసినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. భోజన విరామం తరువాత ఆ వివరాలు తమ ముందుంచాలని ధర్మాసనం ఆదేశించడంతో ఆ తర్వాత వివరాలను అందజేశారు. స్పష్టమైన వివరాలు గురువారం ఉదయానికి అందించాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ఆదేశించారు. గురువారం ఉదయం తొలి కేసుగా తీసుకుని విచారణ చేపడతామని తెలిపారు. ఉదయం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిలుపుదల చేశారు. కేసు వివరాలు పరిశీలించిన తర్వాత ఆదేశాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్