సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిసి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరు..

6 రోజుల క్రితం

ramomohan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 12:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సుప్రీం సీనియర్ న్యాయ‌వాదుల‌తో మంత్రుల బృందం చ‌ర్చ‌లు

34 శాతం కోటా సాధనే లక్ష్యం : ఎపి మంత్రులు

16,800 రాజకీయ ప‌ద‌వులు దక్కుతాయి : రామ్మోహన్‌ నాయుడు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో: స్థానిక సంస్థల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. మంగ‌ళ‌వారం నాడిక్క‌డ ఏపి భ‌వ‌న్‌లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ‌వాదుల‌తో సమావేశమైన మంత్రుల బృందం, న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీంకోర్టు తీర్పులు వివిధ కమిషన్‌ల రిపోర్టుల ఆధారంగా భవిష్యత్తు విధివిధానాలపై చ‌ర్చించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. బిసి రిజర్వేషన్లకు 50 శాతం పరిమితి అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో తగిన ఎంపైరికల్‌ డేటాతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి న్యాయ నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. 34 శాతం రిజర్వేషన్లు అమలైతే సుమారు 16,800 రాజకీయ పదవులు బిసిలకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బిసిల రిజర్వేషన్ల అంశంపై సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గి, దేవదత్‌ కామత్‌లతో చర్చించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్‌టిఆర్‌ హయాంలో స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు అమలు కాగా, 1995లో చంద్రబాబు ప్రభుత్వం వాటిని 34 శాతానికి పెంచిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఎటువంటి చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయ‌కుండా, ఈ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. 34 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు న్యాయపోరాటం కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ బిసిలకు రాజకీయ, సామాజిక సాధికారత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాజ్యాంగంలోని 243డి, 243టి నిబంధనల పరిధిలో స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్