- వసూలు చేసిన సెస్సు రూ.5,187 కోట్లు
- ఖర్చు చేసింది రూ.1,500.78 కోట్లు
- పుష్కర కాలంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తీరుప్రజాశక్తి-అమరావతి బ్యూరో
రెక్కలు ముక్కలు చేసుకుని భవనాలను నిర్మించే భవన నిర్మాణ కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. వారి సంక్షేమం కోసం ప్రభుత్వానికి చేరే సెస్సు నిధులు అందుకు వినియోగించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత వసూలైన రూ.5,187 కోట్ల సెస్సులో కనీసం 30 శాతం కూడా ఖర్చు చేయలేదంటే, కార్మికశాఖ, సంక్షేమ బోర్డుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి పుష్కర కాలంగా వసూలు చేసిన సెస్సు, సంక్షేమానికి ఖర్చు చేసిన మొత్తాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే కార్మికులు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నా.. ఏలిన వారికి మాత్రం అవేవీ పట్టవు. కార్మికుల రిజిస్ట్రేషన్ విషయంలోనూ గతంలో చేసిన సంఖ్య కంటే కొద్దొ, గొప్పొ పెంచి చేయడం మినహా, వాస్తవంగా భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న వారందరినీ నమోదు చేసి బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి, వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం లేదు.
2014 నుంచి 2026 వరకూ బోర్డు సెస్సు రూపంలో రూ.5,187 కోట్లు వసూలు చేసింది. 2014-15 సెస్సు వసూలు కేవలం రూ.100 కోట్లు ఉంటే గతేడాది ఆ మొత్తం రూ.733 కోట్లకు చేరింది. గత 12 ఏళ్ల నుంచి సెస్సు రూపంలో వసూలు చేసిన మొత్తంలో కార్మికుల సంక్షేమానికి కేవలం రూ.1,500 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. అయితే, ఈ సంఖ్యలోను మరో మర్మం దాగి ఉంది. తల్లికి వందనం, ఉపకార వేతనాలు, నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ల పేరుతో ఖర్చు చేసింది రూ.1,239.91 కోట్లుగా ఉంది. ఇది మినహాయిస్తే సంక్షేమ పథకాల ద్వారా కార్మికులకు నేరుగా కలిగిన లబ్ధి రూ.260.87 కోట్లు మాత్రమే. మొత్తంగా పరిగణనలోకి తీసుకున్నా.. వసూలు చేసిన సెస్సులో 29.93 శాతం మాత్రమే కార్మిక సంక్షేమానికి బోర్డు ఖర్చు చేసినట్లు స్పష్టమవుతుంది.
ఎపి భవన, ఇతర నిర్మాణ సంక్షేమ బోర్డు కార్మికుల సంక్షేమానికి మొత్తం 14 రకాల పథకాలను అమలు చేస్తోంది. దీనిలో కార్మికుల బిడ్డలకు ప్రసూతి ప్రయోజనం ఒక్కటే 12 ఏళ్లలో 59,918 మందికి అమలు చేశారు. సగటున ఏడాదికి సుమారు 5 వేల మందికి మాత్రమే ప్రయోజనం దక్కింది. ఇతర పథకాల్లో సహజ మరణం కింద లబ్ధిపొందిన కార్మికులు కేవలం 15,177 మంది, అంత్యక్రియల ఖర్చులు (మట్టి ఖర్చులు) 10,191 మంది, ఆధారపడిన వారికి వృత్తి విద్యా శిక్షణ 11,725 మంది, వివాహ కానుక 7,521 మంది, ఆస్పత్రిలో చేరిన కార్మికులకు ఆర్థిక సహాయం 1,335 మందికి, ప్రమాదవశాత్తు మరణ సహాయం 1,017 మందికి లబ్ధి చేకూర్చగా, మరణం, ప్రమాదం నమోదు కాని కార్మికులకు ఆర్థిక సహాయం 159 మందికి, శాశ్వత, తాత్కాలిక వైకల్య సహాయం 140 మందికి మాత్రమే అందజేయడం చూస్తుంటే.. ఈ పథకాల్లో ఏడాది పదుల సంఖ్యలో మాత్రమే కార్మికులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో భవన, ఇతర నిర్మాణ పనులు చేసే కార్మికులను పూర్తిస్థాయిలో నమోదు చేయకుండా కొంతమందిని మాత్రమే నమోదు చేసి, వారిలోనూ కొద్ది మందికి మాత్రమే ఏటా క్లైములను పరిష్కరించి సహాయం అందిస్తుండటంతో కార్మికులను సంక్షేమం అందడం లేదు. టూల్ కిట్ల పంపిణీ పేరుతో 99,996 మందికి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పేరుతో 1,09,204 మందికి, తల్లికి వందనంలో 7,27,402 లబ్ధి చేకూర్చినట్లు బోర్డు చెబుతూ, గత 12 ఏళ్లలో 10,51,375 మందికి రూ.1,500.78 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతుంది. తమ సంక్షేమం కోసం వసూలు చేస్తున్న సెస్ మొత్తాన్ని తమ కోసం ఖర్చు చేయాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)